రాష్ట్రంలో పెద్ద కులాల పేదలకు 10 శాతం కోటా

రాష్ట్రంలో పెద్ద కులాల పేదలకు 10 శాతం కోటా

రెండేండ్ల తర్వాత గ్రీన్​సిగ్నల్​ ఇచ్చిన సీఎం కేసీఆర్

హైలెవల్ మీటింగ్​లో రివ్యూ చేసి గైడ్​లైన్స్​ జారీ చేయాలని నిర్ణయం

2019లో చట్టం చేసిన కేంద్రం.. ఇన్నాళ్లూ స్పందించని రాష్ట్రం

ఆందోళనలతో దిగొచ్చి అమలు చేస్తామని ప్రకటన

60 శాతానికి రిజర్వేషన్లు.. ఓపెన్​ కోటా 40 శాతానికే పరిమితం

వచ్చే అకడమిక్​ ఇయర్ నుంచి అమలు

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో ఫార్వార్డ్​ క్యాస్ట్​లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రెండు, మూడు రోజుల్లోనే దీనిపై హైలెవల్​ రివ్యూ నిర్వహించి ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ మేరకు సీఎంవో గురువారం ప్రకటన రిలీజ్​ చేసింది. ఫైనాన్షియల్​గా వెనుకబడిన పెద్ద కులాల వారికి విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్రం తెచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్​ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత రిజర్వేషన్లను కొనసాగిస్తూనే అదనంగా ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లను అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి 50% రిజర్వేషన్లు ఉన్నాయని, కొత్త రిజర్వేషన్‌ కలిపితే 60శాతానికి పెరుగుతాయని తెలిపారు. అయితే ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్ల అమలు డిమాండ్​తో ఈ నెల 27న బీజేపీ దీక్ష చేపడతామని ప్రకటించడంతోనే రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రెండేండ్ల ఆలస్యంతో ఎందరికో నష్టం

ఫైనాన్షియల్​గా వెనుకబడిన వర్గాల వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కేంద్ర సర్కారు 2019 జనవరిలో చట్టం చేసింది. దానిని చాలా రాష్ట్రాలు అమలు చేశాయి. కానీ రాష్ట్రంలో టీఆర్ఎస్​ సర్కారు అమలు చెయ్యలేదు. ఈడబ్ల్యూఎస్ చట్టాన్ని అమలు చేయాలని ఆయా వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పట్టించుకోలేదు. దీంతో రాష్ట్రంలో వేలాది మంది నష్టపోయారన్న విమర్శలు ఉన్నాయి. రెండు ఎడ్యుకేషన్ ఇయర్స్ 2019–20, 2020–-21లో స్టూడెంట్లు ఈడబ్ల్యూఎస్​ ప్రయోజనాలు అందుకోలేకపోయారు. రాష్ట్ర పరిధిలో జరిగే ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ, లా, పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు పొందలేకపోయారు. ఈ నష్టానికి టీఆర్ఎస్ సర్కారు ఏ రకంగా బాధ్యత వహిస్తుందన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఏ వర్గాలకు ఎంత రిజర్వేషన్?

రాష్ట్రంలో ప్రస్తుతం 50% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీలకు 25%, ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, బీసీ ఈ కింద 4% కేటాయించారు. ఇప్పుడు 10% ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్లు ఇస్తుండటంతో.. ఓపెన్ కోటా 40 శాతమే ఉంటుంది. 2021–22 నుంచి ఈడబ్ల్యూఎస్  కోటా అమలుచేసే చాన్స్ ఉన్నట్టు ఆధికారులు చెప్తున్నారు. త్వరలో సర్కారు విడుదల చేయనున్న ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లలోనూ ఈడబ్ల్యూఎస్ కోటా అమలయ్యే అవకాశం ఉంది.

ఎంబీబీఎస్​లో రెండేళ్ల కిందటి నుంచే..

ఎంబీబీఎస్​ సీట్ల భర్తీలో 2019 నుంచే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసే రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీలకు మెడికల్​కౌన్సిల్ (ఎంసీఐ) అదనంగా ఎంబీబీఎస్ సీట్లను ఇచ్చింది. మన రాష్ట్రానికి ఈ కేటగిరీలో 190 సీట్లు అదనంగా వచ్చినయి. రిజర్వేషన్​ ఇవ్వకుంటే ఈ సీట్లు కోల్పోతామన్న ఉద్దేశంతో అమలుకు రాష్ట్ర సర్కార్  ముందుకొచ్చింది.

ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు  హామీ అమలేదీ?

రాష్ట్రంలో ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లను పెం చుతామని 2014 అసెంబ్లీ ఎలక్షన్ మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ప్రకటించింది. ఆ ఎలక్షన్లలో గెలిచాక అసెంబ్లీలో ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇప్పటికే బీసీఈ కోటా కింద ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలని, ఎస్టీ రిజర్వేషన్లను ఆరు నుంచి 12 శాతానికి పెంచాలని అందులో పేర్కొంది. కానీ ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదని, చట్టసవరణ చెయ్యాలని కేంద్రంపై ఒత్తిడి చెయ్యలేదన్న విమర్శలు ఉన్నాయి . 2018 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని టీఆర్ఎస్ పేర్కొంది. కానీ ఇంతవరకు ఈ విషయంపై కేంద్రానికి ఎలాంటి విజ్ఞప్తులు చేయలేదని ఆయా వర్గాల నేతలు అంటున్నారు.