జులై 25నే రాష్ట్రపతుల ప్రమాణం..కారణమేంటి..?

జులై 25నే రాష్ట్రపతుల ప్రమాణం..కారణమేంటి..?

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు.  సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ.. ముర్ముతో ప్రమాణం చేయించారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగే ఈ వేడుకకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, స్పీకర్‌ ఓంబిర్లా, కేంద్రమంత్రులు, ఎంపీలు, గవర్నర్లు, సీఎంలు, త్రివిధ దళాల అధికారులు హాజరయ్యారు.

జులై 25నే ప్రమాణం..ఎందుకు..?
నూతన రాష్ట్రపతిగా ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము  జూలై 25న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ముర్ముతో పాటు..ఇప్పటి వరకు మరో తొమ్మిది మంది రాష్ట్రపతులు జులై 25నే ప్రమాణం స్వీకారం చేయడం విశేషం. 1977 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రపతులుగా ఎన్నికైన వారంతా జూలై 25నే ప్రమాణ స్వీకారం చేశారు. భారత మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ దేశ తొలి రాష్ట్రపతిగా 1950 జనవరి 26న ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఆయన రెండు సార్లు ఎన్నికయ్యారు. అనంతరం 1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి పదవిని చేపట్టారు. సర్వేపల్లి తర్వాత డా. జాకీర్ హుస్సేన్, వీవీ గిరి, ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌లు రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించినా..పూర్తి కాలంలో పదవిలో ఉండలేదు. వీరి తర్వాత 1977లో నీలం సంజీవరెడ్డి జులై 25న రాష్ట్రపతిగా ప‌దవీ బాధ్యతలు స్వీకరిచారు. ఆయన రాష్ట్రపతిగా ఐదేళ్లు కొనసాగారు.  ఆ తర్వాత రాష్ట్రప‌తులుగా మారిన ప్రతీ ఒక్కరూ విజయవంతంగా ఐదేళ్లపాటు పదవిలో ఉన్నారు. దీంతో అప్పటి నుంచి జులై 25న బాధ్యతలు స్వీకరించడం..ఐదేళ్ల తర్వాత  జులై 24న పదవీ విమరణ చేయడం ఆనవాయితీగా వ‌స్తోంది. జ్ఞానీ జైల్ సింగ్, వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రామ్‌నాథ్ కోవింద్ కూడా జులై 25నే ప్రమాణ స్వీకారం చేశారు. 

ఇది రాజ్యాంగంలో లేదు..అయినా..
వాస్తవానికి జూలై 25 నే భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయాలని రాజ్యాంగంలో పొందుపర్చలేదు. అలాగని ఇదేం నియమం కూడా కాదు. కానీ సెంటిమెంట్గా దాదాపు 45 ఏళ్లుగా ఇదే విధంగా కొనసాగుతోంది.