ఆరోగ్యశ్రీలో కిడ్నీల చికిత్సకే ఏటా వంద కోట్లు ఖర్చు

ఆరోగ్యశ్రీలో  కిడ్నీల చికిత్సకే ఏటా వంద కోట్లు ఖర్చు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డయాలసిస్ పేషెంట్ల సంఖ్య 15 వేలకు చేరువైంది. ఇందులో ఆరోగ్యశ్రీ కింద దాదాపు 10 వేల మంది డయాలసిస్‌‌‌‌ చేయించుకుంటుండగా, మరో 5 వేల మంది ప్రైవేటు హాస్పిటళ్లలో డయాలసిస్‌‌‌‌ చేయించుకుంటున్నారు. ఇంకో ఐదేండ్ల తర్వాత డయాలసిస్ పేషెంట్ల సంఖ్య ఇప్పుడున్నదానికి డబుల్ అయ్యే అవకాశం ఉందని జీవన్‌‌‌‌దాన్‌‌‌‌ ప్రోగ్రామ్ ఇన్​చార్జ్‌‌‌‌ డాక్టర్ స్వర్ణలత తెలిపారు. మారుతున్న జీవన శైలి వల్ల జనాలు చిన్న వయసులో బీపీ, షుగర్ బారిన పడుతున్నారని, ఈ రోగాల వల్ల కిడ్నీలు దెబ్బతింటున్నాయని చెప్పారు. కిడ్నీ వ్యాధి లక్షణాలు త్వరగా బయటపడకపోవడంతో ఎక్కువ మంది రోగులు సకాలంలో ట్రీట్‌‌‌‌మెంట్ తీసుకోవట్లేదు. దీంతో రోగం ముదిరి డయాలసిస్​ వరకూ వస్తోంది. రాష్ట్రంలో ఏటా ఐదొందలకు పైగా కిడ్నీ ట్రాన్స్‌‌‌‌ప్లాంటేషన్లు జరుగుతున్నాయి. జీవన్‌‌‌‌దాన్‌‌‌‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుని కిడ్నీల కోసం ఎదురు చూస్తూనే ఏటా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కిడ్నీల కోసం ఇప్పటికీ 5,460 మంది వెయిటింగ్‌‌‌‌లోనే ఉన్నారు. 

ఏడాదికి వంద కోట్లు

ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద చేస్తున్న ఖర్చులో ఎక్కువ శాతం కిడ్నీ, గుండె జబ్బులకే వెచ్చించాల్సి వస్తోంది. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ కిడ్నీ రోగుల చికిత్స కోసమే సర్కార్ రూ.700 కోట్లు ఖర్చుపెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో 3 డయాలసిస్ సెంటర్లు ఉంటే, ఇప్పుడు వాటి సంఖ్య 103కు పెరిగింది. మరోవైపు కొత్తగా డయాలసిస్ సెంటర్లు పెట్టాలని, ఉన్న సెంటర్లలో మెషిన్ల సంఖ్య పెంచాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.

మానసిక సమస్యలకు ‘టెలి మెడిసిన్‌‌‌‌’

మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చి రిలీఫ్‌‌‌‌ కలిగించేందుకు సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులతో కూడిన కాల్ సెంటర్‌‌‌‌‌‌‌‌ను మంత్రి హరీశ్‌‌‌‌ రావు మంగళవారం ప్రారంభించారు. కేంద్రం తెచ్చిన నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌‌‌‌లో భాగంగా టెలి మానస్ పేరిట హైదరాబాద్‌‌‌‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీసులో ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు. ఎర్రగడ్డలోని మెంటల్ హెల్త్ ఇనిస్టిట్యూట్‌‌‌‌ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కాల్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌.. ప్రతి రోజూ 24 గంటలు పనిచేస్తుందని మంత్రి తెలిపారు. మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్లెవరైనా 14416 టోల్‌‌‌‌ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌కు ఫోన్ చేసి తమ సమస్యలు చెప్పుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రులలో జెరియాట్రిక్ కేర్ సెంటర్లు ప్రారంభిస్తామన్నారు.