కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల కొండ వెళ్లే భక్తులకు శుభవార్త. మరిన్ని సహాయ కేంద్రాలు.. అదే హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయటానికి నిర్ణయం తీసుకున్నది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి. 2025, నవంబర్ 8వ తేదీన.. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో జరిగిన అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తిరుమల కొండకు వచ్చే భక్తులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించటంతోపాటు.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు కల్యాణ కట్ట, లడ్డూ ప్రసాదం కౌంటర్ల దగ్గర హెల్ప్ డెస్క్ లు వెంటనే ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు వెంకయ్య చౌదరి. శ్రీవారి భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయం ఆధారంగా.. సేవలను విస్తృతం చేయటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారాయన.
ఈ సమావేశంలోనే అధికారులకు మరికొన్ని సూచనలు, సలహాలు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారాయన. శ్రీవారి మెట్టు, అలిపిరి కాలిబాట మార్గాల్లో కొండపైకి వచ్చే భక్తులకు.. పంచాయతీ, ఆరోగ్య విభాగాలు సమన్వయంతో దుకాణాల్లో తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. నాణ్యమైన, కల్తీ లేని ఆహార పదార్థాలు మాత్రమే అమ్మే విధంగా వ్యాపారులను ప్రోత్సహించాలని సూచించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి.
నిత్య అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదం వడ్డించేటప్పుడు శుభ్రత పాటించాలని.. సిబ్బంది పరిశుభ్రంగా ఉండాలని.. చేతులకు గ్లౌజులు ధరించి వడ్డించాలని ఆదేశించారాయన. లగేజీ కౌంటర్ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా.. భక్తులకు సకాలంలో లగేజీ అందేలా సిబ్బంది పని తీరును పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారాయన. భక్తులు గదుల కాషన్ డిపాజిట్ తిరిగి పొందడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిసెప్షన్ విభాగం చర్యలు తీసుకోవాలని.. ఏటీసీ నుంచి ఆక్టోపస్ సర్కిల్ వరకు ఉండే క్యూ లైన్లలో భక్తులకు అన్న ప్రసాదం, మంచి నీళ్లు నిరంతరం అందేలా చూడాలని సూచించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి.
కొండపైకి వచ్చే వాహనాల పార్కింగ్ అంశంపై.. గోపార్క్ టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన ప్రజంటేషన్ పరిశీలించిన ఆయన.. త్వరలో కొండపై ట్రాఫిక్ సమస్య, క్రమబద్దీకరణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు.
