మాగంటి మృతిపై వివాదం.. సమగ్ర విచారణకు కేంద్ర మంత్రి బండి డిమాండ్.. ఫిర్యాదు వస్తే చేస్తమని చెప్పిన సీఎం రేవంత్

మాగంటి మృతిపై వివాదం.. సమగ్ర విచారణకు కేంద్ర మంత్రి బండి డిమాండ్.. ఫిర్యాదు వస్తే చేస్తమని చెప్పిన సీఎం రేవంత్

= దవాఖానలోతన కొడుకును కేటీఆర్ చూడనివ్వలేదన్న గోపీనాథ్ తల్లి మహానందకుమారి
= కేటీఆర్ వచ్చే వరకు మృతి చెందాడన్న విషయం ప్రకటించలేదని వెల్లడి
= తండ్రి చివరి చూపు చూడనివ్వలేదంటున్న కొడుకు తారక్ ప్రద్యుమ్న
= తనతో డైవర్స్ అయిపోయినట్లు ప్రూఫ్ చూపించాలంటున్న మాలినీ దేవి 
= చనిపోయిన తర్వాత వేలిముద్రలు పెట్టించుకున్నారంటూ బండి ఆరోపణ
= ఫిర్యాదు వస్తే కచ్చితంగా దర్యాప్తు చేస్తమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
= జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ చిచ్చు రేపుతున్న కుటుంబ వివాదం

హైదరాబాద్: మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీ వివాదం చినికిచినికి గాలివానలా మారింది. ఆయన మృతి పై అనుమానాలున్నాయని నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కేటీఆర్ వచ్చే వరకు గోపీనాథ్ మృతి చెందిన విషయాన్ని ప్రకటించలేదని అంటున్నారు.

 మొదటి భార్య కొడుకు తారక్ ప్రద్యుమ్న ను అంత్యక్రియలకు రావద్దని మాజీ మంత్రి పువ్వాడ బెదిరించినట్టు సంజయ్ ఆరోపించారు. 95 ఏండ్ల వృద్ధురాలైన ఆయన తల్లిని సైతం ఆస్పత్రిలో చూడనివ్వలేదని ఆరోపిస్తున్నారు. మాగంటి గోపీనాథ్ మృతిపై న్యాయ విచారణ జరిపించాలని అంటున్నారు. గోపీనాథ్ తల్లి మహానంద కుమారి మాత్రం కేటీఆర్ తనను కొడుకు దగ్గరకు వెళ్లనీయలేదని చెబుతున్నారు. ఆయన వచ్చే వరకు తన కుమారుడు మృతి చెందిన విషయాన్ని ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాలినీ దేవితో తాను గోపీనాథ్ వివాహాన్ని 1998లో జరిపించనట్టు చెబుతున్నారు. అయితే ఈ వివాదాన్ని పది మందిలోకి రావడం.. కమ్మ సామాజిక వర్గం సెక్షన్లలో చర్చనీయాంశంగా మారింది. 

గోపీనాథ్ మృతి ఎపిసోడ్ అంతా అనుమానాస్పదమే

మాగంటి గోపీనాథ్ మృతి మొత్తం అనుమానాస్పదమే. గోపి అదే రోజు చనిపోయారా? అంతకంటే ముందురోజు కన్నుమూశారా? కొంతమంది కోసం ఆలస్యంగా ఆయన మరణవార్తను ప్రకటించాల్సి వచ్చిందా?  ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులు, గోపీనాథ్‌ తల్లి, సతీమణి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాలి. తండ్రి అంత్యక్రియల కోసం తాను అమెరికా నుంచి వస్తే, బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి ఒకరు ఫోన్‌ చేసి రావొద్దని బెదిరించారంటూ గోపి తనయుడు తారక్‌  చెప్పిన మాటలు తేలిగ్గా తీసుకోవద్దు. 
= బండి సంజయ్ , కేంద్ర మంత్రి 

కేటీఆర్ నా బిడ్డను చూడనివ్వలే

కొడుకు బతికున్నాడో.. చనిపోయాడో చూడనివ్వలేదు.. ఇంతటి వయసులో నాకు ఇంతటి వ్యథ ఎందుకు..? మేం ఎప్పుడూ బయటికి రాలేదు.. అతని చావే ఒక మిస్టరీ చేశారు.. అంతా కేటీఆరే చెప్పాలి.. చచ్చిపోయాడని కొందరు అంటారు.. బతికున్నారని కొందరన్నారు. కొందరు లోనికివెళ్తున్నారు.. ఇంకొందరు లోనికి వస్తున్నారు.. నన్నలోనికి వెళ్లనీయ్యలేదు.. కేటీఆర్ వెళ్తుంటే పరిగెత్తి అడిగా ఒక్క సారి చూస్తానని.. ఆయన తలదించుకొని వెళ్లిపోయారు. వెంటిలెటర్ లో ఉండగా వెళ్లనివ్వలేదు.. వాడికి 63 ఏండ్లు.. నాకు 95 ఏండ్లు.. పిల్లాడిని చూస్తానంటే చూడనివ్వలేదు. కేటీఆర్ వచ్చే వరకు నా బిడ్డ మరణించాడన్న విషయం ప్రకటించలేదు..
= మహానందకుమారి, గోపీనాథ్ తల్లి

అంత్యక్రియలకు రావద్దని బెదిరించారు 
తన తండ్రి గోపీనాథ్ అంత్యక్రియలకు రావద్దని బీఆర్ఎస్ నాయకుడొకరు బెదిరించారు. మా నాన్న నాతో తరుచూ మాట్లాడేవారు. ఫోన్ ఎత్తనిపక్షంలో వాయిస్ మెస్సేజ్ లు, మెయిల్స్ పంపేవారు. అన్నీ నాదగ్గర ఉన్నాయి. మా మమ్మీతో నాన్న డైవర్స్ తీసుకోలేదు. 

విడాకులు కాలేదు..

  

1998లో మా వివాహం జరిగింది. మా దగ్గర ఉన్న ఆధారాలు శేరిలింగంపల్లి తహసీల్దార్ ఆఫీసులో చూపించాం.. మాకు విడాకులు కాలేదు.. విడాకులైనట్టు కొందరు అంటున్నారు.. ప్రూఫ్స్ చూపించాలె.. 
మాలినీ దేవి, గోపీనాథ్ మొదటి భార్య

ఫిర్యాదు చేస్తే విచారణ

గోపీనాథ్ మృతి పై కేటీఆర్ హస్తం ఉన్నదని బండి సంజయ్ గారు అంటున్నారు . ఆయన ఫిర్యాదు చేస్తే  ప్రభుత్వం తప్పక విచారణ చేయిస్తుంది. ఫిర్యాదు లేనిది ఒక మరణాన్ని వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని నేను అనుకుంటలేను.  నేను కూడా టీవీలలో చూసిన నా కుమారుడి మరణానికి కేటీఆర్ కారణమని గోపీనాథ్ తల్లి మాట్లాడినట్టుగా నాకు అనిపించింది.మాదాపూర్  పోలీస్ స్టేషన్ కు బండి సంజయ్ గారు లెటర్ రాస్తే విచారణ చేస్తం..
= రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

అన్ని వేళ్లూ కేటీఆర్ వైపే

మాగంటి మృతి ఎపిసోడ్ లో అన్ని వేళ్లూ కేటీఆర్ వైపే చూపిస్తున్నాయి. మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి.. కేటీఆర్.. తన కొడుకు ను ఆస్పత్రిలో చూడనీయలేదని ఆరోపిస్తోంది. అమెరికా నుంచి కేటీఆర్ వచ్చే వరకు  మృతి చెందినట్టు ఎందుకు ప్రకటించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ కారణమని గోపీనాథ్ తల్లి మాట్లాడారని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇలా అందరూ కేటీఆర్ వైపే చూస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.