- ఎగ్జామినేషన్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: విద్యార్థులు, నిరుద్యోగుల కలలను, కష్టాన్ని బుగ్గిపాలు చేస్తున్న పేపర్ లీకేజీలు, మాల్‌ప్రాక్టీస్‌లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చింది. దీని ప్రకారం పేపర్ లీకేజీలు, మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన వారికి ఐదేండ్ల జైలు శిక్ష.. రూ. కోటి ఫైన్ విధిస్తారు. ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తున్న పరీక్షలలో అవకతవకలను అడ్డుకునేందుకు ప్రత్యేక చట్టం ఇప్పటి వరకు అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ( ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్2024’ ను తీసుకొచ్చింది. సోమవారం కేంద్ర పర్సనల్ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
క్వశ్చన్పేపర్, ఆన్సర్స్ కీ లీకేజీ’’, ‘పబ్లిక్ ఎగ్జామ్స్‌లో అభ్యర్థికి సాయం చేయడం’, ‘కంప్యూటర్ నెట్‌వర్క్ ట్యాంపరింగ్ చేయడం’, ‘నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించడం’, ‘నకిలీ పరీక్షల నిర్వహణ, నకిలీ అడ్మిట్ కార్డ్‌లు, ఆఫర్ లెటర్లు, జాయినింగ్ లెటర్లు ఇవ్వడం’ తదితర నేరాలను ఇందులో పొందుపరిచారు. ఇది చట్టంగా మారితే పరీక్షలకు సంబంధించి నేరం చేసిన వారికి కనిష్టంగా మూడేండ్లు.. అవసరమైతే ఐదేండ్ల జైలు శిక్ష విధించవచ్చు. అలాగే రూ.కోటి జరిమానాతోపాటు పరీక్షల నిర్వహణ ఖర్చులు కూడా బాధ్యుల నుంచి వసూలు చేయోచ్చు. అలాగే నేరం రుజువైతే ఆ వ్యక్తులు, అధికారులు, నిర్వహణ ఏజెన్సీలపై పరీక్షల విధుల్లో పాల్గొనకుండా నాలుగేండ్ల బ్యాన్ విధించే అవకాశం ఉంటుంది.
