ఆస్ట్రేలియాకు చెందిన ఈ పదేండ్ల పాప ఏం చేస్తోందో తెలిస్తే షాక్ అవుతారు. చిన్న పిల్లల బొమ్మలకు సంబంధించిన బిజినెస్ చేస్తోంది. నెలకు కోటి రూపాయలు సంపాదిస్తోంది. ఆమె పేరు పిక్సీ కర్టిస్. టాయ్స్ బిజినెస్‌లో వండర్ కిడ్‌గా పేరు తెచ్చుకున్న పిక్సీ గురించి.ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని బాగా చదివి, మంచి ఉద్యోగంలో స్థిరపడితే చాలని అనుకుంటారు. అందుకోసం స్కూల్, కాలేజీ, కోర్సులు అన్నీ దగ్గరుండి సెలెక్ట్ చేస్తారు. ఎంత ఏజ్ వచ్చినా పిల్లల్ని గైడ్ చేస్తారు. కానీ, అలా చేయడం వల్ల నష్టమే కానీ, లాభం లేదు అని అంటుంది పిక్సీ వాళ్ల అమ్మ రాక్సీ జసెంకో. రాక్సీ ఆస్ట్రేలియాలో ఆమె పాపులర్ పీఆర్ ఎక్స్పర్ట్. ఆమె 14 ఏండ్ల వయసులో మెక్‌డొనాల్డ్స్‌లో జాబ్ చేసేది. ఒక బిజినెస్ పర్సన్‌గా లైఫ్‌ను రన్ చేయడం సవాలుతో కూడిన విషయంగా అప్పుడే తనకు అనిపించింది. మెక్‌డొనాల్డ్స్ జాబ్ తర్వాత ఆమె తన సొంత పీఆర్ఫర్మ్ స్టార్ట్ చేసింది. తన పిల్లలకు లీడర్ షిప్ లక్షణాలు పెంచి. బిజినెస్ పర్సన్స్‌గా డెవలప్ చేయాలన్నది రాక్సీ కల.
అలా అనుకుంటున్నప్పుడే పిక్సీ పుట్టింది. కూతురు పుట్టగానే ఆమె పేరు మీద 2011లో ‘పిక్సీస్ బౌస్’ అనే బిజినెస్ కూడా మొదలు పెట్టింది. ఆ తర్వాత పిక్సీస్ ‘ఫిడ్‌జెట్స్’ అనే మరో వ్యాపారం కూడా ప్రారంభించింది. ఇప్పుడు ఇవి విజయవంతంగా సాగుతున్నాయి. పిక్సీకి ఆ టాయ్స్ గురించి తల్లి ఎక్స్ప్లెయిన్ చేసేది. దీంతో టాయ్స్ గురించి పిక్సీకి తొందర్లోనే అర్థమైంది. పిల్లల బొమ్మలు, పిల్లలకు అవసరమయ్యే స్టేషనరీ, సరదా గాడ్జెట్స్ అన్నిటినీ అమ్ముతోంది. కొత్తగా వచ్చే బొమ్మలకు రివ్యూ ఇస్తుంది. అవి ఎలా వాడాలో, వాటి ధర ఎంతో, ఏ వయసు వారికి బాగుంటాయో చెప్తుంది కూడా. ఇలా చిన్నప్పటి నుంచే వ్యాపారంలో కిటుకులు తెలుసుకున్న పిక్సీ ఇప్పుడు నెలకు రెండు వ్యాపారాల ద్వారా కోటి రూపాయల దాకా సంపాదిస్తోంది. పిక్సీ ఫిడ్జెట్’ కంపెనీ మొదటి నెలలోనే కోటీ యాభై లక్షల విలువైన టాయ్స్‌ను అమ్మింది. పిక్సీకి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. దానికి 90వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నాలుగేళ్ల కిందట.. ఆరేళ్ల వయసులోనే ఈ చిన్నారి ఇన్‌స్టాగ్రామ్‌లో స్పాన్సరింగ్ యాడ్ కోసం నాలుగున్నర లక్షలు తీసుకుంది. పిక్సీకి ఇప్పుడు పదేండ్లు. ‘15 ఏండ్ల తర్వాత ఈ బిజినెస్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటా’ అని చెప్తోంది.
===
