చైన్‌ స్నాచింగ్‌ చేస్తే పదేళ్ల జైలు

చైన్‌ స్నాచింగ్‌ చేస్తే పదేళ్ల జైలు
  • గుజరాత్‌ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం

చైన్‌ స్నాచింగ్‌కు దేశవ్యాప్తంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటే గుజరాత్‌లో మాత్రం ఇక నుంచి పదేళ్ల వరకు శిక్ష పడనుంది. ఇందుకు సంబంధించి ఆ రాష్ట్రం చేసిన చట్టానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారని ఓ హోం శాఖ అధికారి చెప్పారు. ఇప్పటివరకైతే దేశవ్యాప్తంగా ఐపీసీ సెక్షన్‌ 379 ప్రకారం మూడేళ్ల వరకు జైలు లేదా ఫైన్‌ లేదా రెండూ విధిస్తారు. అయితే చైన్‌ స్నాచింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన గుజరాత్‌ సర్కారు 2018 సెప్టెంబర్‌లో సెక్షన్‌ 379ని సవరించి 379 ఏ, 379బీని కలిపింది. ద క్రిమినల్‌ లా (గుజరాత్‌ అమెండ్‌మెంట్‌) పేరుతో ఆమోదించింది. దాని ప్రకారం చైను లాగడానికి ప్రయత్నించారని రుజువైతే ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. చైను లాగితే ఏడేళ్లు, లాగేటప్పుడు ఎవరినైనా గాయపరిస్తే 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.