రామగుండంలో ఈఎస్‌‌ఐ హాస్పిటల్‌‌

రామగుండంలో ఈఎస్‌‌ఐ హాస్పిటల్‌‌
  • రెండేండ్లలో 100 పడకలతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి 
  • పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని రామగుండంలో బొగ్గు గనుల కార్మికుల కోసం 100 పడకల ఈఎస్‌‌ఐ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ఆస్పత్రికి 2018 సెప్టెంబర్‌‌ 20న ఈఎస్‌‌ఐసీ ఇన్‌‌ ప్రిన్సిపల్‌‌ ఆమోదం ఇచ్చిందని తెలిపింది. జనరల్‌‌ మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఐ, డెంటల్, పీడియాట్రిక్స్‌‌ వంటి విభాగాలు హాస్పిటల్‌‌లో ఉంటాయని వెల్లడించింది. 

ఈ మేరకు శుక్రవారం లోక్‌‌సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌‌ రావ్‌‌ జాదవ్‌‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఆస్పత్రి ప్రాజెక్టు ప్రస్తుతం టెండర్‌‌‌‌ దశలో ఉందని, ఈ ప్రక్రియ పూర్తయ్యాక.. భవన నిర్మాణం పూర్తి కావడానికి రెండేండ్ల సమయం పడుతుందన్నారు. మాడ్యూలర్‌‌ ఆపరేషన్‌‌ థియేటర్, సీఎస్‌‌ఎస్‌‌డీ, మెడికల్‌‌ గ్యాస్‌‌ పైప్‌‌లైన్‌‌ వంటి ఆధునిక సదుపాయాలు హాస్పిటల్‌‌లో ఉంటాయని వెల్లడించారు. 

వైద్య సిబ్బంది నియామకానికి 2023 డిసెంబరు 15న జరిగిన 192వ కార్పొరేషన్‌‌ మీటింగ్‌‌లో ఆమోదించిన కొత్త రూల్స్ అమల్లో ఉంటాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అయితే, బొగ్గు గనుల ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రత్యేక నిధుల కేటాయింపుపై వివరాలివ్వలేమని కేంద్ర మంత్రి తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన మంత్రి ఆరోగ్య సురక్షా యోజన బడ్జెట్‌‌ అంచనా రూ.9,839 కోట్లుగా నిర్ణయించినట్లు వెల్లడించారు.