టీసీఎస్: కోటి జీతం అందుకుంటున్న ఉద్యోగులు 103 మంది

టీసీఎస్: కోటి జీతం అందుకుంటున్న ఉద్యోగులు 103 మంది

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ (టీసీఎస్​).. పేరే ఒక బ్రాండ్​. ఆ బ్రాండ్​ ఇప్పుడు సెంచరీ కొట్టింది. ఎందులో అంటారా.. కంపెనీలోని కోటీశ్వరుల జాబితాలో! కోటికి పైగా జీతం ఎత్తుకుంటున్న టీసీఎస్​ ఉద్యోగులు 103 మందికి పెరిగారు. ఇందులో దాదాపు పావు శాతం మంది కంపెనీలోనే కెరీర్​ను ప్రారంభించారు. 2017 ఆర్థిక సంవత్సరంలో కోటి వేతనం పొందుతున్న టాప్​ అధికారులు 91 మంది ఉండగా, 2019 ఆర్థిక సంవత్సరంలో 103కు పెరిగారు. అది కూడా సీఈవో రాజేశ్​ గోపీనాథన్​, సీవోవో ఎన్​జీ సుబ్రమణియంలను పక్కనబెడితే. వాళ్లిద్దరినీ కలిపితే ఆ సంఖ్య 105. అంతేగాకుండా విదేశాల్లో పనిచేస్తున్న టాప్​ ఎగ్జిక్యూటివ్​లనూ లెక్కలోకి తీసుకోలేదు. ఇన్ఫోసిస్​లోనూ కోటీశ్వరులైన ఉన్నతాధికారులు 60 దాకా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇన్ఫోసిస్​లా టీసీఎస్​ ఉద్యోగులకు స్టాక్​ ఆప్షన్​ ఇవ్వదు. ఈ జాబితా నివేదికను ఎకనామిక్​ టైమ్స్​ (ఈటీ) ప్రచురించింది.

అధికారికంగా ప్రకటించని టీసీఎస్​
జీతం, అలవెన్సులు, క్యాష్​ ఇన్సెంటివ్​, ఆదాయపన్ను నిబంధనల ప్రకారం వారి ఆస్తుల విలువ, ప్రావిడెంట్​ ఫండ్​లో కంపెనీ భాగం లెక్కన ఉన్నతాధికారుల జీతం కోటి దాటిందని డైరెక్టర్లకు కంపెనీ ఇచ్చిన అనెగ్జర్​లో పేర్కొన్నట్టు ఈటీ తెలిపింది. దీనికి సంబంధించి కంపెనీ ఇంకా వార్షిక నివేదికను ప్రచురించలేదని, స్పందించలేదని వెల్లడించింది. కాగా, కంపెనీ ఇంతలా సక్సెస్​ అవడానికి కారణం, చాలా మంది సీనియర్లు స్థిరంగా కంపెనీలో ఉండడమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇతర కంపెనీలకు టాలెంటెడ్​ ఉద్యోగులను వదులుకోకుండా ఉండేలా చాలా మంది ఉద్యోగులకు నాయకత్వ బాధ్యతలను అప్పగించడంలో కంపెనీ ముందుండడమూ అందుకు కారణమని చెబుతున్నారు. ‘‘చాలా మంది సీనియర్​ ఎగ్జిక్యూటివ్​లు టీసీఎస్​ను వదల్లేదు. ఉద్యోగులు కంపెనీ విడిచి వెళ్లకుండా మంచి కెరీర్​ బాటలు పరిచారు. నాయకత్వ వికేంద్రీకరణ కూడా కంపెనీకి మంచి చేసింది” అని ముంబైకి చెందిన బ్రోకరేజీ నిపుణుడు ఒకరు చెప్పారు. ఇక, త్రైమాసిక లక్ష్యాలను అందుకునేందుకు దాదాపు 200 మంది సీనియర్​ ఎగ్జిక్యూటివ్​లకు పెద్ద బాధ్యతలను కంపెనీ అప్పగించింది. ఉన్నతస్థాయి అధికారులను ఆ లక్ష్యాల నుంచి విముక్తి కల్పించింది. సీఈవో, ప్రెసిడెంట్లు, ఎగ్జిక్యూటివ్​ వైస్​ ప్రెసిడెంట్​ లాంటి వాళ్లకు కొత్త మార్కెట్లు, సర్వీసులకు ఎంటరవడం, వివిధ వర్గాల కస్టమర్లను ఆకర్షించడం వంటి 3–5 ఏళ్ల ప్రణాళికలపై పనిచేసే ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది.

దేబాశిష్ ఘోష్కు 4.7 కోట్లు
కంపెనీలో ఎక్కువ మొత్తం జీతం అందుకుంటున్న ఉన్నతాధికారి దేబాశిష్​ ఘోష్​. టీసీఎస్​ లైఫ్​సైన్సెస్​, హెల్త్​కేర్​ అండ్​ పబ్లిక్​ సర్వీసెస్​ హెడ్​గా ఉన్న ఆయనకు ₹4.7 కోట్లు అందుతోంది. ఆ తర్వాత బ్యాంకింగ్​, ఫైనాన్షియల్​ సర్వీసెస్​ అండ్​ ఇన్సూరెన్స్​ బిజినెస్​ చీఫ్​ కే కృతీవాసన్​₹4.3 కోట్ల వార్షిక ప్యాకేజీ అందుకుంటున్నారు. రీటెయిల్​ అండ్​ కన్జ్యూమర్​ ప్రొడక్ట్స్​ హెడ్​ ప్రతీక్​ పాల్​ ఏటా ₹4.3 కోట్ల ప్యాకేజీ పొందారు. అయితే, ఆయన ఆ తర్వాత డిజిటల్​ ఇనిషియేటివ్​ కోసం టాటా సన్స్​కు బదిలీ అయ్యారు. బిజినెస్​ అండ్​ టెక్నాలజీ సర్వీసెస్​ హెడ్​ కృష్ణన్​ రామానుజం ఏడాదికి ₹4.1 కోట్ల జీతం పొందుతున్నారు. కంపెనీ చీఫ్​ టెక్నాలజీ ఆఫీసర్​ (సీటీవో) కే అనంత కృష్ణన్​ ₹3.5 కోట్ల జీతం అందుకుంటున్నారు. పెద్ద వయసులో కోటికి పైగా పారితోషికం అందుకున్న ఉద్యోగి 72 ఏళ్ల  బరీంద్ర సాన్యాల్​.