జూబ్లీ హిల్స్‌లో 100+ మి.మీ. వర్షపాతం.. 13గంటల పాటు కరెంట్ కట్

జూబ్లీ హిల్స్‌లో 100+ మి.మీ. వర్షపాతం.. 13గంటల పాటు కరెంట్ కట్

హైదరాబాద్‌ లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సోసైటీ తెలిపిన వివరాల ప్రకారం, జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలోని షేక్‌పేట్‌లోని జీహెచ్‌ఎంసీ సంక్షేమ కార్యాలయం సమీపంలో 105.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, శ్రీనగర్ కాలనీలో మే 1న తెల్లవారుజామున 1:00 గంటల వరకు 73 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది

భారీ వర్షాల కారణంగా జూబ్లీహిల్స్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. దాదాపు 13 గంటలపాటు కరెంటు లేకుండా పోయిందని కొంతమంది నివాసితులు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు. కుండపోత వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో రాత్రి సమయంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది.

ఖాజాగూడ ప్రాంతంలోనూ గణనీయమైన వర్షపాతం నమోదైంది. ఇది 96 మి.మీ నమోదైనట్టుగా తెలుస్తోంది. మాదాపూర్‌లోని కాకతీయ కొండలలో 68.8 మి.మీ వర్షపాతం నమోదైంది.

రానున్న మూడు రోజుల పాటు నగరంలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో నివాసితులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.