- కోతులను పట్టిస్తానని సర్పంచ్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి
- తమిళనాడు నుంచి కోతులు పట్టే బృందాన్ని పిలిపించిన సర్పంచ్
- బోనుల్లో బంధించిన సిబ్బంది
- ఒకదానిపై ఒకటి దాడి చేసుకొని.. ప్రాణాలు విడిచిన మూగజీవాలు
- వరంగల్ జిల్లా నల్లబెల్లిలో ఘటన
నల్లబెల్లి (వరంగల్), వెలుగు: సర్పంచ్ ఎన్నికల్లో కోతులను పట్టిస్తామన్న హామీని నెరవేర్చే క్రమంలో.. అవగాహనలేక దాదాపు 100 కోతుల ప్రాణాలు తీశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. నల్లబెల్లిలో కోతుల బెడద ఉందని.. కోతులను పట్టించి ఇక్కడి నుంచి తరలిస్తామని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్అభ్యర్థి హామీ ఇచ్చి.. గెలుపొందాడు.
ఈ క్రమంలో మంగళవారం తమిళనాడు నుంచి కోతులుపట్టే బృందాన్ని నల్లబెల్లికి తీసుకువచ్చారు. కోతులను బంధించి కాళేశ్వరం అడవుల్లో వదిలేయాలని వారితో ఒప్పందం చేసుకున్నారు. మంగళవారం రోజంతా పలుచోట్ల బోనులను ఏర్పాటుచేసి.. పట్టిన కోతులను పట్టినట్టుగా వాటిలో బంధించారు. వెంటనే బోన్లను తరలించి అడవిలో వదిలేయకపోవడంతో బోన్లల్లో గుంపులు గుంపులుగా ఉన్న కోతులు ఒకదానిపై మరొకటి దాడి చేసుకున్నాయి. పారిపోయే అవకాశం లేక చాలా కోతులు బోన్లలోనే చనిపోయాయి. ఎక్కువ సంఖ్యలో కోతులు చనిపోవడంతో సాయంత్రం గమనించిన స్థానికులు, గ్రామ సిబ్బంది.. కోతులు పట్టే బృందంపై సీరియస్ అయ్యారు. సురక్షితంగా వాటిని తరలిస్తామనిచెప్పి ప్రాణాలు తీశారంటూ ఫైర్ అయ్యారు. బృందసభ్యులు మాత్రం తాము వాటిని వేర్వేరు బోన్లలోకి మార్చేందుకు ప్రయత్నం చేయగా తమపైనే దాడి చేశాయని చెప్తున్నారు.
