- కాలేజీ స్టూడెంట్లకు ఫ్రీ ఎంట్రీ
హైదరాబాద్, వెలుగు: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)కు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ లీగ్ తొలి అంచె మ్యాచ్‌లు షార్జాలో జరుగుతుండగా, వచ్చే నెల 1వ తేదీ నుంచి 3 తేదీ వరకు రెండో అంచె పోటీలు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీ స్టూడెంట్లకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు శుక్రవారం ప్రకటించారు. దీనికి సీసీఎల్ ఆర్గనైజర్స్ అంగీకరించారని తెలిపారు.
మూడు రోజుల పాటు రోజుకు పది వేల మంది కాలేజీ (ఇంటర్మీడియేట్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడికల్) స్టూడెంట్లను స్టేడియంలోకి ఉచితంగా అనుమతిస్తామని చెప్పారు. ఆసక్తి గల కాలేజీ ప్రిన్సిపాల్స్ హెచ్‌సీఏ ఈ మెయిల్ [email protected] కు తమ విద్యాసంస్థల నుంచి ఎంత మంది వస్తున్నారో విద్యార్థుల పేర్ల సహా మెయిల్ చేయాలని సూచించారు. ఈ సీజన్‌లో ఉప్పల్ స్టేడియంలో మొత్తం ఆరు మ్యాచ్‌లు జరగనున్నాయని జగన్‌మోహన్ రావు చెప్పారు. రోజుకు రెండు చొప్పున మూడ్రోజుల పాటు ఆరు మ్యాచ్‌లు ఉంటాయన్నారు.
