ప్రపంచ జనాభాలో 103 కోట్ల మందికి ఊబకాయం

ప్రపంచ జనాభాలో 103 కోట్ల మందికి ఊబకాయం
  • ప్రతి 8 మందిలో ఒకరు ఎక్కువ బరువున్నరు 
  • మన దేశంలో 1.25 కోట్ల మంది పిల్లలు, 7 కోట్ల మంది పెద్దలకు ఒబెసిటీ
  • పోషకాహార లోపమే కారణం.. అండర్ వెయిట్ సమస్య తగ్గుముఖం
  • 190 దేశాల్లోని 22 కోట్ల మందిపై డబ్ల్యూహెచ్ వో స్టడీ 

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8 మందిలో ఒకరు అంటే.. దాదాపు 103 కోట్ల మంది ఊబకాయం (ఒబెసిటీ)తో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) అధ్యయనంలో వెల్లడైంది. మన దేశంలో 1.25 కోట్ల మంది పిల్లలు, 7 కోట్ల మంది పెద్దలు స్థూలకాయం బారిన పడ్డారని తేలింది. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో 1990 నుంచి 2022 మధ్య పిల్లలు, పెద్దల్లో అండర్ వెయిట్, ఓవర్ వెయిట్ పరిస్థితి ఎలా ఉందన్న కోణంలో డబ్ల్యూహెచ్ వోతోపాటు ఎన్ సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబొరేషన్ సంస్థకు చెందిన 1,500 మంది రీసెర్చర్లు సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. 

ఆయా దేశాల్లోని 5 నుంచి 19 ఏండ్ల మధ్య ఉన్న 6.3 కోట్ల మంది పిల్లలు, టీనేజర్లు.. 20 ఏండ్లకు పైబడిన 15.8 కోట్ల మంది పెద్దలపై అధ్యయనం చేశారు. వీరందరి బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ)ని లెక్కించి.. ఒబెసిటీ, అండర్ వెయిట్ శాతాలను అంచనా వేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 2022లో 15.9 కోట్ల మంది పిల్లలు, 87.9 కోట్ల మంది పెద్దలు.. మొత్తంగా 103 కోట్ల మంది ఒబెసిటీతో ఉన్నారని రీసెర్చర్లు గుర్తించారు. 1990 నాటితో పోలిస్తే 2022 నాటికి ఒబెసిటీ రేటు నాలుగు రెట్లు పెరిగిందని తెలిపారు. అయితే, 1990 నుంచి అండర్ వెయిట్ సమస్య మాత్రం తగ్గుముఖం పట్టినట్టు స్టడీలో వెల్లడైంది. 

మన దేశంలో 8.25 కోట్ల మందికి.. 

ఇండియాలో 1.25 కోట్ల మంది 5 నుంచి 19 ఏండ్లలోపు పిల్లలు ఓవర్ వెయిట్​తో ఉన్నారని ఈ స్టడీ తేల్చింది. మన దేశంలో పెద్దల్లో ఒబెసిటీ రేటు 1990లో 1.2 శాతం ఉండగా, 2022 నాటికి అది 9.8 శాతానికి పెరిగింది. దేశంలో 2022లో దాదాపు 4.40 కోట్ల మంది మహిళలు, 2.60 కోట్ల మంది పురుషులు ఒబెసిటీతో ఉన్నారని తేలింది. 

పోషకాహారలోపమే ప్రధాన కారణం 

సాధారణంగా అండర్ వెయిట్ అయినా.. ఓవర్ వెయిట్ అయినా.. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్లే వస్తుందని, ఈ రెండింటిలో ఏ సమస్య బారిన పడినా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని రీసెర్చర్లు హెచ్చరించారు. వాతావరణ మార్పులు, కరోనా విపత్తు, ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాలతో అనేక దేశాల్లో మాల్ న్యూట్రిషన్ (పోషకాహారలోపం) సమస్య పెరుగుతోందని కూడా వీరు తెలిపారు. 

అనేక దేశాల్లో ఆరోగ్యకరమైన తిండి లేక పిల్లలు, పెద్దలు తక్కువ లేదా ఎక్కువ బరువు ఉంటున్నారని వెల్లడించారు. టీనేజర్లలో ఊబకాయాన్ని నివారించాల్సిన అవసరం ఉందని రీసెర్చర్లు పేర్కొన్నారు. మంచి ఆహారం, శారీరక శ్రమ వంటివి అలవాటు చేయాలన్నారు. ఆహార ఉత్పత్తులపై ప్రభుత్వాలు,  ప్రైవేట్ సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ స్టడీ వివరాలు ఇటీవల ‘ది లాన్సెట్’ జర్నల్​లో పబ్లిష్ అయ్యాయి.