హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఫిట్నెస్ లేని, ఓవర్లోడ్వాహనాలపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా కేవలం రెండు రోజుల్లోనే అంటే ఈ నెల 12, 13 తేదీల్లోనే ఆయా వాహనాలపై 1,050 కేసులు నమోదు చేసి, 750 వాహనాలను సీజ్ చేసినట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
చేవెళ్ల ప్రమాదం నేపథ్యంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 33 ఎన్ ఫోర్స్మెంట్బృందాలు, రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఓవర్ లోడ్ వాహనాలను క్వారీ లు, రీచ్ ల వద్దనే నియంత్రించేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
అలాగే క్వారీ, రీచ్ యజమానులపై చర్యలు తీసుకునే విధంగా మైనింగ్ శాఖ కు సిఫార్స్ చేశామన్నారు. సంబంధిత వాహన దారుల పర్మిట్ తో పాటు వాహనాన్ని నడిపిన డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తామని రవాణా శాఖ తెలిపింది. మైనింగ్ శాఖతో సమన్వయం చేసుకుని ఓవర్ లోడ్ నియంత్రణ కు పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని తెలిపింది.అలాగే వాహనాలకు ఫిట్ నెస్ లేకున్నా, త్రైమాసిక పన్ను కట్టకుండా తిరిగినా అటువంటి వాహనాలను సీజ్ చేస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు.
