- ఆన్ లైన్ వెరిఫికేషన్ లో18 స్కూళ్లకు 5 స్టార్ రేటింగ్
- 239 స్కూళ్లకు 4 స్టార్ రేటింగ్
మెదక్, వెలుగు: 'స్వచ్ ఏవమ్ హరిత్ విద్యాలయ' సర్వేలో మెదక్ జిల్లాలో నుంచి 1,058 స్కూళ్లు పాల్గొన్నాయి. ఆయా స్కూళ్ల దరఖాస్తుతో పాటు పొందుపర్చిన వివరాల ఆధారంగా ఆన్ లైన్ వెరిఫికేషన్ లో 18 స్కూళ్లకు 5 స్టార్ రేటింగ్, 239 స్కూళ్లకు 4 స్టార్ రేటింగ్ వచ్చింది. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీ వాటిని పరిశీలించి అర్బన్ నుంచి 2 స్కూళ్లు, రూరల్ నుంచి 6 స్కూళ్లు ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపుతుంది.
ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో తాగునీరు, మరుగుదొడ్లు, పచ్చదనం, పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, విద్యుత్ పొదుపు, సోలార్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 'స్వచ్ ఏవమ్ హరిత్ విద్యాలయ' పేరుతో సర్వే చేపట్టింది. సెప్టెంబర్ 30 వరకు స్వచ్ ఏవమ్ హరిత విద్యాలయ సర్వేలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
ఈ సర్వేలో మెదక్ జిల్లాలో ప్రభుత్వ పరిధిలోని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, జిల్లా పరిషత్ హైస్కూళ్లు, కేజీబీవీ, మోడల్, రెసిడెన్షియల్ స్కూళ్లు, ప్రైవేట్ స్కూళ్లు అన్నీ కలిపి మొత్తం 1,058 స్కూళ్లు పాల్గొన్నాయి. సంబంధిత స్కూళ్ల యాజమాన్యాలు మౌలిక వసతులు, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ పొదుపు, సౌరశక్తిని వినియోగం విషయంలో తమ పాఠశాలల పనితీరుకు సంబంధించిన ఫొటోలను స్వచ్ ఏవమ్ హరిత విద్యాలయ వెబ్ పోర్టల్ లో అప్ లోడ్ చేశారు.
ఆ వివరాల ఆధారంగా జిల్లాలో 18 స్కూళ్లకు 5 స్టార్ రేటింగ్ లభించింది. 239 స్కూళ్లకు 4 స్టార్ రేటింగ్, 625 స్కూళ్లకు 3 స్టార్ రేటింగ్, 138 స్కూళ్లకు 2 స్టార్ రేటింగ్, 38 స్కూళ్లకు 1 స్టార్ రేటింగ్ వచ్చింది.
ఎవల్యూటర్స్ పరిశీలన..
స్వచ్ ఏవమ్ హరిత విద్యాలయ సర్వేలో పాల్గొన్న స్కూళ్ల యాజమాన్యాలు వెబ్ పోర్టల్ లో పొందు పరచిన వివరాలు సరైనవేనా కాదా అనేది గుర్తించేందుకు ఎవల్యూటర్స్ గా నియమితులైన స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు గత నెల 28,29,30, 31 తేదీల్లో నాలుగు రోజుల పాటు సంబంధిత స్కూళ్లను పరిశీలించారు. వారు సమర్పించే నివేదికల ఆధారంగా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి కమిటీ 4, 5 స్టార్ రేటింగ్ వచ్చిన స్కూళ్లలో అత్యుత్తమంగా ఉన్న వాటిలో అర్బన్ ఏరియా నుంచి 2, రూరల్ ఏరియా నుంచి 6 స్కూళ్లు ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపుతుంది. అక్కడ 5 స్టార్ రేటింగ్ వచ్చిన స్కూళ్లు నేషనల్ లెవల్ కు సెలెక్ట్ అవుతాయి.
