ఈ జిల్లాలో ప్రజలు 107 భాషల్లో మాట్లాడుకుంటారు

ఈ జిల్లాలో ప్రజలు 107 భాషల్లో మాట్లాడుకుంటారు

బెంగళూరు: భారతదేశంలో వందకు పైగా భాషల్లో ప్రజలు మాట్లాడుకునే జిల్లాగా బెంగళూరు అగ్ర స్థానంలో నిలిచింది. దక్షిణాదిలోనే కాదు..  ఇండియన్‌ సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన బెంగళూరు జిల్లాలో ఏకంగా 107 భాషలు మాట్లాడుకునే ప్రజలు ఉన్నారని ఓ పరిశోధనలో వెల్లడైంది. రాజ్యాంగ షెడ్యూల్ లోని 22 భాషల్లనే కాదు.. మరో 84 నాన్ షెడ్యూల్ భాషల్లో కూడా మాట్లాడుకుంటారని 2011 జనాభా లెక్కలను విశ్లేషించిన ఇద్దరు పరిశోధకులు ఈ విషయం వెల్లడించారు. 
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ ముదిత్ కపూర్ బ్రూకింగ్‌ ఇన్‌స్టిట్యూషన్‌కు చెందిన ఎన్నారై సీనియర్‌ ఫెలో షమిక రవి కలసి చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.  బెంగళూరు తర్వాత అత్యధికంగా 103 భాషలు మాట్లాడే ప్రజలు ఉన్న దిమాపూర్‌ (నాగాల్యాండ్‌) రెండో స్థానంలో నిలువగా అసోమ్ లోని సోనిత్ పూర్  101 భాషలు మాట్లాడే ప్రజలతో మూడో స్థానంలో నిలిచింది. గరిష్ట సంఖ్యలో భాషలతోపాటు.. అతితక్కువ భాషలు మాట్లాడే జిల్లాల్లో యానాం (పుదుచ్చేరి), కైమూర్‌ (బీహార్‌) కౌశాంబి (ఉత్తర ప్రదేశ్‌) అరియలూర్‌ (తమిళనాడు) ఉన్నట్లు ప్రొఫెసర్ ముదిత్ కపూర్, ఎన్నారై సీనియర్ ఫెలో షమిక రవి విశ్లేషించారు.

అత్యధిక భాషలు మాట్లాడే జిల్లాగా అగ్ర స్థానంలో నిలిచిన బెంగళూరు జిల్లాలో తెలుగు భాషను మాట్లాడేవారి సంఖ్య మూడోస్థానంగా తేలింది. బెంగళూరు జిల్లాలో అత్యధికంగా 44 శాతం మంది మాతృభాష అయిన కన్నడ భాషను మాట్లాడుతారు. ఆ తర్వాత 15 శాతం మంది తమిళం మాట్లాడతారు. తమిళం మాట్లాడేవారు రెండో స్థానంలోఉండగా, 14 శాతం మంది మాట్లాడే తెలుగు మూడో స్థానంలో నిలిచింది. భారతదేశంలో వందకుపైగా భాషలు మాట్లాడుకుంటున్నారని తెలిస్తే మనం ఆశ్చర్యపోతున్నాం.. కానీ అమెరికాలోని న్యూయార్క్ జిల్లాలో  600లకు పైగా భాషలు మాట్లాడేవారు ఉన్నారని ఎన్నారై సీనియర్‌ ఫెలో షామిక రవి వెల్లడించారు.