మొరాయించిన 108 వాహనం..ప్రాణాలు కోల్పోయిన గిరిజన మహిళ

మొరాయించిన 108 వాహనం..ప్రాణాలు కోల్పోయిన గిరిజన మహిళ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. ప్రాణాలు నిలబెట్టాల్సిన 108 అంబులెన్స్.. గిరిజన మహిళ ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది.  చర్ల మండలం రాళ్లాపురం గ్రామానికి చెందిన మడివి చుకిడి అనే మహిళ.. కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ గ్రామానికి చేరుకుంది.  అనంతరం బాధితురాలిని అంబులెన్స్లో చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా...అటవీ మార్గంలో తాలిపేరు ప్రాజెక్టు దగ్గర 108 వాహనం ఆగిపోయింది. సిబ్బందితో పాటు..బాధితురాలి కుటుంబ సభ్యులు అంబులెన్స్ను తోసినా స్టార్ట్ కాలేదు. చివరకు ఆమెను కుటుంబ సభ్యులు బైక్పై చర్ల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే చుకిడి చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించడంతో  కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అంబులెన్స్ మొరాయిస్తుందని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని..వారి నిర్లక్ష్యం కారణంగానే గిరిజన మహిళ  ప్రాణం కోల్పోయిందని స్థానికులు ఆరోపించారు.