గర్భిణిని మంచంపై మోసుకొచ్చిన 108 సిబ్బంది.. రోడ్డు సరిగా లేక గ్రామానికి చేరుకోలేని అంబులెన్స్‌‌‌‌

గర్భిణిని మంచంపై మోసుకొచ్చిన 108 సిబ్బంది.. రోడ్డు సరిగా లేక గ్రామానికి చేరుకోలేని అంబులెన్స్‌‌‌‌
  • మంచంపై కిలోమీటర్‌‌‌‌ దూరం తీసుకొచ్చి హాస్పిటల్‌‌‌‌కు తరలింపు

ఏటూరు నాగారం, వెలుగు: అంబులెన్స్‌‌‌‌ వెళ్లేందుకు రోడ్డు లేకపోవడంతో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని 108 సిబ్బంది మంచంపై కిలోమీటర్‌‌‌‌ దూరం వరకు మోసుకొచ్చారు. ఈ ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం చిట్యాల గ్రామ పరిధిలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కన్నాయిగూడెం మండలంలోని చిట్యాల గ్రామ పరిధిలోని గొత్తికోయ గూడెంకు చెందిన పాయం జ్యోతి (23) శుక్రవారం పురిటినొప్పులతో బాధపడడంతో 108కు సమాచారం ఇచ్చారు. 

అంబులెన్స్‌‌‌‌ సిబ్బంది చిట్యాల గ్రామ శివారుకు చేరుకున్నాక.. అడవిలోని గొత్తి కోయగూడెంకు వెళ్లేందుకు రోడ్డు మార్గం లేకపోవడంతో అక్కడే నిలిచిపోయింది. దీంతో 108 పైలట్ రవీందర్, ఈఎంటి మహేశ్వరి గూడేనికి చేరుకొని జ్యోతిని స్థానికుల సాయంతో మంచంపైన కిలోమీటర్ దూరంలో ఉన్న అంబులెన్స్‌‌‌‌ వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి 108లో కన్నాయిగూడెంలోని ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. అంబులెన్స్‌‌‌‌ సిబ్బందిని గర్భిణి కుటుంబసభ్యులు, ప్రజలు, ఆఫీసర్లు అభినందించారు.