పదో తరగతి పరీక్షలు: నిమిషం నిబంధన సడలింపు

పదో తరగతి పరీక్షలు: నిమిషం నిబంధన సడలింపు

రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలకు సర్వం సిద్ధం అయ్యింది. అంతే కాదు పదోతరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ కూడా చెప్పారు అధికారులు. ఇప్పటి వరకు ఎంతో కఠిన నిబంధనగా ఉన్న ‘ఒక్క నిమిషం’ నిబంధనను అధికారులు ఎత్తివేశారు. 10వ తరగతి ఎగ్జామ్స్ మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు.

నిమిషం లేటయితే పరీక్షా కేంద్రాల్లోకి స్టూడెంట్స్‌ని అనుమతించడం లేదు. చాలా పరీక్షలకు ఈ నిబంధనను అధికారులు అమలు చేస్తున్నారు. దీంతో ఎంతో విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన స్టూడెంట్స్ ఉన్నారు. దీనిపై విద్యాశాఖాధికారులు సమీక్షించి.. నిబంధనను ఎత్తివేశారు. అలా అని ఎప్పుడు పడితే అప్పుడు ఎగ్జామ్ కు వస్తామంటే కుదరదు. ఐదు నిమిషాల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,523 ఎగ్జామ్ సెంటర్ల లో పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి తెలిపారు. 11,023 స్కూళ్ల  నుంచి 5 లక్షల 52 వేల 302 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతారని అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. పరీక్షల ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్లు , డీఈవో లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రాల దగ్గర ఒక ANM ను , ఆశా వర్కర్లను అందుబాటులో ఉంచుకోవాలని, అలాగే ORS ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పరీక్షల దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు.

ఎగ్జామ్స్ సెంటర్స్‌కు విద్యార్థులు, పరీక్ష సిబ్బంది మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకరావద్దని అధికారులు సూచించారు. పరీక్ష కేంద్రాన్ని విద్యార్థులు ఒక రోజు ముందేగానే చూసుకోవాలని ,విద్యార్థులు హాల్ టికెట్, పెన్, పెన్సిల్, రైటింగ్ ప్యాడ్ ను వెంట తీసుకోవాలన్నారు. ఒక నిమిషం నిబంధన తరలించినప్పటికీ,పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకుంటే బెటర్ అంటున్నారు విద్యాశాఖ అధికారులు.