
ఆంధ్రప్రదేశ్‌లో జూలై 10 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. పరీక్షలు జరిగే నాటికి కరోనా పరిస్థితుల్లో మార్పులను బట్టి అందుకు అనుగుణంగా మార్పులు చేస్తామన్నారు. కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఎగ్జామ్ సెంటర్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. మంగళవారం విద్యా శాఖ మంత్రి మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,154 ఎగ్జామ్ సెంటర్లను గుర్తించామని, ఒక్కో రూమ్ లో 10 నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్, మాస్కులను అందుబాటులో ఉంచుతామని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఓపెన్ స్కూల్ విద్యార్థులకు 1,022 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన లేకుండా బాగా ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాయాలని ఆయన సూచించారు.