గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు కోసం... వెంకటేష్ కందునూరి ముందడుగు..

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు కోసం... వెంకటేష్ కందునూరి ముందడుగు..

‘సాధనమున పనులు సమకూరు ధరలోన’.. అంటే ప్రయత్నం చేస్తూ ఉంటే భూమిమీద పనులు నెరవేరుతాయి అని. ఇదే బాటలో నడుస్తున్నాడు ఈ చిత్రకళా కారుడు వెంకటేశ్ కందునూరి. తనలో ఉన్న టాలెంట్​ని గుర్తించి మరింత సానపెట్టాడు. తాను గీసే ప్రతి గీత.. సామాన్యుడికి కూడా అర్థమవ్వాలి. సమాజానికి తనవంతు కృషి చేయాలనే తపనతో వినూత్నంగా ఆలోచించి ఓ పెయింటింగ్ వేశాడు. దానిమీద ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖుల సంతకాలను సేకరిస్తూ ఆ పెయింటింగ్​లో ఉన్న సందేశాన్ని తెలియజేస్తున్నాడు. గిన్నిస్​ వరల్డ్ రికార్డ్​లో చోటు సంపాదించి, ఐక్యరాజ్యసమితిలో తన పెయింటింగ్​ను ప్రదర్శించాలనే గొప్ప ఆలోచనతో ముందడుగు వేస్తున్నాడు. 

మహబూబాబాద్ జిల్లా, నరసింహుల పేట మండలంలో కొమ్మలవంచ అనే కుగ్రామంలో జన్మించాడు వెంకటేశ్​ కందునూరి. తండ్రి రాములు, తల్లి భారతమ్మలకు ఇతడు ఆరో సంతానం. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన వాడైనప్పటికీ బాల్యం నుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆర్ట్​ వేయడం నేర్చుకున్నాడు. ప్రతి పెయింటింగ్​లో సామాజిక స్పృహ, చైతన్యపరిచే అంశాలను పొందుపరుస్తున్నాడు. చిత్రకళతోపాటు శిల్పకళ, ఆర్కిటెక్చర్​లోనూ ప్రావీణ్యం ఉంది. కుంచె పట్టిన చేత్తోనే ప్రపంచ రికార్డు సాధిస్తానంటోన్న 37 ఏండ్ల ఆర్టిస్ట్​ వెంకటేశ్​ ప్రయాణం అతని మాటల్లోనే.. 

ఆర్ట్స్​ అండ్ స్పోర్ట్స్

చిన్నప్పటి నుంచి ఆర్ట్​, స్పోర్ట్స్​ అంటే చాలా ఇష్టం. స్టేట్ లెవల్ కబడ్డీ ప్లేయర్​ని. హై స్కూల్​లో జరిగే డ్రాయింగ్ పోటీల్లో పాల్గొనేవాడిని. ఇంటర్మీడియెట్​కి వచ్చేసరికి ఆర్ట్ వైపు వెళ్తే కెరీర్​ ఉండదేమోననే భావనలో అప్పుడు ఆర్ట్ వేయడం ఆపేశాను. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సరూర్​నగర్ స్టేడియంలో స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా ఆధ్వర్యంలో కబడ్డీ ఆడేందుకు హైదరాబాద్​ వచ్చాను. అక్కడే ఒక ఆర్ట్​ స్టూడియో చూడడానికి వెళ్లాను. అందులో ఉన్న పెయింటింగ్స్​ చూసి చాలా ఆశ్చర్యమేసింది. అప్పటినుంచి మళ్లీ పెయింటింగ్స్​ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. దాంతో మళ్లీ పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టా. 

అప్పుడు కొందరు ఆర్టిస్ట్​ ప్రొఫెషన్​లోకి వెళ్లాలంటే ఫైన్​ఆర్ట్స్​ డిగ్రీ చేయమని సజెస్ట్ చేశారు. ఆ సలహాతో నాలుగేండ్ల బ్యాచిలర్​ ఆఫ్​ ఫైన్​ ఆర్ట్స్​లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. తర్వాత పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో జర్నలిజంలో మాస్టర్స్​ చేశాను. నేషనల్, ఇంటర్నేషనల్​ లెవల్​లో నా పెయింటింగ్స్​ గుర్తింపు పొందాలనే లక్ష్యంతో కష్టపడేవాడిని. పెయింటింగ్స్​ని ఎలా మార్కెట్ చేయాలి? ఇండియాలో ఫేమస్ ఆర్టిస్ట్ ఎవరు? ఇంటర్నేషనల్​ ఆర్టిస్ట్​గా ఎలా గుర్తింపు పొందాలి? అనే ఆలోచనతో ఉండేవాడిని. ఆ ఆలోచనతోనే 2010లో ఇంటర్నేషనల్ సెలబ్రెటీ అయిన క్రికెట్ స్టార్​ సచిన్ టెండూల్కర్ పెయింటింగ్​ గీసి, సెలబ్రెటీలతో సంతకాలు చేయించాను. సచిన్​ని కలిసి ఆ పెయింటింగ్​ను ఆయనకు ప్రెజెంట్ చేశాను. 

ఆశయం ఇదే

కళాకారుడిగా గుర్తింపు పొందాలంటే చాలాకాలం పడుతుంది. కొందరికి లైఫ్​ టైం కూడా పడుతుంది. ఒక ఆర్టిస్ట్​గా నా కళను ప్రదర్శించడమే కాదు.. ఆర్ట్​ ద్వారా ప్రపంచానికి పరిచయం అవ్వాలి. అదే ఆర్ట్​ ద్వారా ప్రపంచానికి ఒక సందేశమివ్వాలి. ఐదు ప్రధాన దేశాల్లో ఈ పెయింటింగ్​ని ప్రదర్శించాలి. ఫైనల్​గా ప్రపంచశాంతి కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శించాలనుకుంటున్నాను.

సచిన్ పెయింటింగ్ ఇన్​స్పిరేషన్​తో..

సచిన్​కి ఇచ్చిన ఆ పెయింటింగ్ ఇన్​స్పిరేషన్​తో ఈసారి యూనివర్సల్​ కాన్సెప్ట్​ ఆలోచించాను. ప్రపంచవ్యాప్తంగా అందరికీ కనెక్ట్​ అయ్యేలా, సందేశాత్మకంగా ఉండేలా ఒక పెయింటింగ్​ గీయాలనుకున్నాను. ఆ ఆలోచనలో నుంచి వచ్చినదే ‘ప్రపంచశాంతి’ (వరల్డ్ పీస్) థీమ్​. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే కాన్సెప్ట్​తో ‘వసుదైక కుటుంబం’ (వరల్డ్ ఈజ్ ఒన్ ఫ్యామిలీ) టైటిల్​తో 2022లో ఈ పెయింటింగ్ గీశాను. మానవాళి అంతా భూమ్మీద ఒకే గర్భంలో బతుకుతున్నాం. అంటే అంతరిక్షంలో గర్భంతో ఉన్న ఒకే గ్రహం భూమి. ఆ గర్భంలో అందరం తలొక వైపు జీవిస్తున్నాం. కులం, మతం, వర్గం, వర్ణం అని రకరకాల బేధాలతో విడిపోయి కొట్లాడుకుంటున్నాం. మనమంతా ఒకే ఫ్యామిలీ, ఒకే తల్లి బిడ్డలం అనేది మర్చిపోయి భూమికి గర్భశోకాన్ని మిగులుస్తున్నాం అనేది ఈ పెయింటింగ్ ప్రధానాంశం. 

అంతేకాకుండా 196 దేశాలకు సంబంధించిన వారి దేశాల జెండాలు, ప్రపంచానికి సంబంధించిన 14 ముఖ్యమైన మతాల జెండాలను, మత గురువులు, ప్రముఖులు, ముఖ్యమైన అంశాలు.. ఇలా రకరకాల విషయాలను పొందుపరిచాను. ఈ పెయింటింగ్​ని 2023, మేలో గవర్నర్​ సౌందర రాజన్​ ఆవిష్కరించారు. ఈ మెసేజ్ ప్రపంచానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో 2024 నుంచి ఇంటర్నేషనల్ సెలబ్రెటీల సంతకాలు సేకరించడం మొదలుపెట్టాను. దీనికి ఇండియన్​ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఎనలేని ప్రోత్సాహాన్ని అందించింది. రెండు వందలమంది ఇంటర్నేషనల్ స్థాయి క్రికెటర్లతో సంతకాలు చేయించినట్టుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్​కి అప్లయ్ చేయాల్సి ఉంది. కచ్చితంగా అవార్డు కూడా దక్కుతుందని ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. 

ప్రస్తుతం 220 మంది ఇంటర్నేషనల్ క్రికెట్ సెలబ్రెటీలు, 20 మంది ప్రముఖుల సిగ్నేచర్స్​ ఆ పెయింటింగ్ మీద కలెక్ట్ చేశాను. రీసెంట్​గా హుస్సేన్ బోల్ట్ పెయింటింగ్​ మీద సైన్ చేశాడు. ఇంకా నా లిస్ట్​లో ఫుట్​బాల్ ప్లేయర్స్ మెస్సీ, రొనాల్డో, టెన్నిస్ ప్లేయర్ ఫెడరర్, బాక్సర్ మైక్ టైసన్, బిజినెస్​మెన్ ఎలన్​ మస్క్ వంటి సెలబ్రెటీలు ఉన్నారు. ఫైనల్ టార్గెట్​ మనదేశ ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికన్ ప్రెసిడెంట్​ ట్రంప్​. 

మంత్రి సాయం మరువలేను

ఈ సంతకాల సేకరణలో భాగంగా వివిధ దేశాల్లో దీన్ని ప్రదర్శించాలనే లక్ష్యం కోసం ఆర్థిక సాయం అందించాలని కొందరు ప్రముఖులను కలిశాను. వారిలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్​ వెంకటస్వామి గారు సానుకూలంగా స్పందించారు. ఐక్యరాజ్యసమితికి వెళ్లేవరకు తనవంతు సాయం అందిస్తానని చెప్పారు. ఫైనాన్షియల్​గా కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆయనకు అంబేద్కర్​, వెంకటస్వామి (కాకా) పెయింటింగ్స్​ ప్రెజెంట్ చేశాను.

యద్భావం తద్భవతి!

ఆయిల్ పెయింటింగ్స్, అబ్​స్ట్రాక్ట్​ ఆర్ట్​, పోట్రెయిట్​ ఇలా రకరకాలుగా వేస్తుంటాను. నా పెన్సిల్ ఆర్ట్​ కొంచెం స్పెషల్​గా ఉంటుంది. నాకు స్వతహాగా ఇష్టమైనవి ప్రోట్రెయిట్స్. ఈ మధ్య ‘యద్భావం తద్భవతి’ అనే టైటిల్​తో ఒక పెయింటింగ్ వేశాను. అది కూడా సామాజిక దృక్కోణంలో ఉంటుంది. మనిషి జీవితం గురించి లోతుగా ఆలోచిస్తే మనలో ఉండే కోపం, ద్వేషం, ఈర్ష్య వంటివి చాలా చిన్నవిగా అనిపిస్తాయి. 

ఎందుకంటే ‘మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది’ అంటే, మనిషిగా మారడానికి అంతకుముందు ఏదో అనుకున్నాను. అందుకు తగినట్టు ఒక శూన్యంలో సౌరకుటుంబం, భూమి, జీవరాశులు ఇలా అన్నీ ఏర్పడ్డాయి. ఏదో ఒక శక్తి ఇదంతా నడిపిస్తుంది అనేది దీని ఉద్దేశం. సొసైటీకి ఒక సందేశం చెప్పాలనే ఈ కాన్సెప్ట్​ని తీసుకున్నాను. సామాన్యుడికి అర్థమయ్యేలా పెయింటింగ్ వేయడమే నా లక్ష్యం.