వెలుగు ఓపెన్ పేజీ: చిన్నారి ప్రాణం తిన్న అగ్రకుల అహంకారం!

వెలుగు ఓపెన్ పేజీ: చిన్నారి ప్రాణం తిన్న అగ్రకుల అహంకారం!

కుమ్మెర ఘటన ఒక వార్త కాదు.  అది ఒక గ్రామపు  క్రైమ్ రిపోర్ట్ కాదు, ఒక పోలీస్ కేసు ఫైల్ నంబర్ కాదు,  ఒక వ్యక్తిగత  ఘర్షణ కాదు.  అది తెలంగాణ  సమాజం తనను  తాను  చూసుకునే  నైతిక అద్దం.  మనం ఏం అయ్యామో, ఏం కావాలనుకుంటున్నామో,  ఏం కావాలో చెప్పే  భయంకరమైన నిజం.  వంద రూపాయల కోసం  ‘తక్కువ జాతి’ అనే ముద్రతో  ఒక చిన్నారి ప్రాణం తీసిన ఈ ఘటన  మన  సమాజపు  అంతరాత్మను  కుదిపేసే శబ్దం.  

కానీ,  ఈ శబ్దం మనకు వినిపిస్తున్నదా?  లేక  మామూలు వార్తల గందరగోళంలో  అది మళ్లీ  మౌనంగా మారిపోతుందా?. ఈ దేశ రాజ్యాంగం గర్వంగా  చెప్పుకునే  సమానత్వం,  స్వేచ్ఛ, సోదరభావం అన్న మాటలు గ్రామపు అంచుల్లో ఎందుకు మాయమవుతాయి?  డిజిటల్ యుగం, అంతరిక్ష యాత్రలు,  గ్లోబల్ టెక్నాలజీ  గురించి మాట్లాడే సమాజం, తన గ్రామాల్లో ఇంకా మనుషులను జాతులుగా వర్గీకరించి,  హక్కులను రద్దు చేసి,  ప్రాణాలకు తక్కువ విలువ ఇచ్చేస్థాయికి ఎందుకు దిగజారుతోంది?    దేవుడి దర్శనానికి వచ్చిన ఒక చాకలి కుటుంబాన్ని  ‘మీరు తక్కువ జాతి,  దేవుడిని చూడటానికి అర్హులు కాదు’ అని చెప్పడం ఒక వ్యక్తి మాట కాదు.

  అది శతాబ్దాలుగా సమాజంలో నాటుకుపోయిన ఒక సిద్ధాంతం మాట.  మహిళలను కిందకు తోసేయడం, పిల్లవాడిని కొట్టడం, చివరకు ఒక చిన్నారి ప్రాణం పోవడం.. ఇవి కేవలం హింస కాదు,  ఇవి మన సమాజంలో ఉన్న కుల గర్వం, కుల ద్వేషం, కుల ఆధిపత్యం అనే మానసిక వ్యాధి ప్రత్యక్ష రూపం.  ఇది కేవలం  ఒక వ్యక్తి  క్రూరత్వం కాదు, ఇది ఒక సమాజపు క్రూరత్వం.

ఎక్కువ, తక్కువ అనే వివక్ష బతికే ఉంది!

మన శాస్త్రాలు,  ఉపనిషత్తులు,  భక్తి సంప్రదాయాలతోపాటు  గురువులు కూడా..  అందరూ దేవుడి ముందు సమానమే అన్నారు.  కానీ,  మన గ్రామాల్లో,  కుటుంబాల్లో,  మన మనసుల్లో మాత్రం ‘ఎవరు పై జాతి,  ఎవరు తక్కువ జాతి’ అనే వివక్ష ఇంకా బతికే ఉంది.  ఈ వివక్ష కేవలం  భావోద్వేగం కాదు.  అది ఒక సామాజిక నిర్మాణం. ఒక ఆర్థిక వ్యవస్థ.  ఒక రాజకీయ శక్తి నిర్మాణం.  ఒక సాంస్కృతిక నియంతృత్వం. అందుకే ఇలాంటి ఘటనలు  మన వ్యవస్థలోని లోపాలను  ప్రతిబింబిస్తాయి.  బాధితులు కాళ్లపై  పడి వేడుకున్నా కనికరం చూపకపోవడం,  చిన్నపాపను కాళ్లతో తన్నడం, కొబ్బరికాయల రాడ్‌‌‌‌‌‌‌‌తో పొడవడానికి ప్రయత్నించడం..ఇవి వ్యక్తిగత క్రూరత్వం మాత్రమే కాదు. ఇవి వ్యవస్థాగత హింసగా పేర్కొనాలి.  

 మహనీయులు చెప్పిందే జరుగుతోంది!

డాక్టర్  బీ.ఆర్. అంబేద్కర్  కుల వ్యవస్థను  ‘హిందూ  సమాజపు అంతర్గత శత్రువు’గా  అభివర్ణించారు.  ఆయన కులాన్ని  కేవలం  సామాజిక విభజనగా కాదు.  అది ఒక ఆర్థిక,  రాజకీయ, నైతిక,  మానవ హక్కుల సమస్యగా చూశారు.  ‘కులం అనేది కేవలం వివాహ వ్యవస్థ కాదు,   శ్రమ విభజన కాదు, అది శ్రమ విభజనలో హైరార్కీ’ అని ఆయన చెప్పారు.  జ్యోతిరావు ఫూలే  బ్రాహ్మణ్య వ్యవస్థను  ప్రశ్నిస్తూ ‘శూద్రులు, అతిశూద్రులు శతాబ్దాలుగా అణచివేయబడిన వర్గాలు’ అని చెప్పారు.  ఆయన విద్యను  విముక్తి  సాధనంగా  చూశారు. 

పెరియార్  ఈ.వి. రామస్వామి  కులాన్ని,  మతాన్ని,  దేవుడిని  కూడా  విమర్శించారు. ఆయన  ‘కులం ఉన్నంత కాలం మానవత్వం ఉండదు’  అని ఘంటాపథంగా చెప్పారు.  కుల హింస జరిగినప్పుడు రాజకీయ వ్యవస్థ  స్పందన  ఒక  నాగరికత  పరీక్ష.   కానీ చాలా సందర్భాల్లో  ఆ స్పందన నిశ్శబ్దంగా ఉంటుంది.  ఎందుకంటే  కులం రాజకీయ శక్తి నిర్మాణంలో భాగం.   కుల సమీకరణాలు,  ఓటు బ్యాంకులు,  సామాజిక ఆధిపత్యాలు.. ఇవి రాజకీయ  నైతికతను బంధిస్తాయి. 

కులహింసను చట్టం నిర్మూలిస్తుందా?

గ్రామాల్లో ఇంకా దేవాలయాల ప్రవేశం,  భోజనాల వేర్పాటు,    కులం ఆధారంగా అవమానం కొనసాగుతున్నంత కాలం.. మనది ఆధునిక సమాజం అని చెప్పుకోవడం ఒక నాటకం.   కులహింసను చట్టంతో  మాత్రమే నిర్మూలించలేం.  చట్టం శిక్షిస్తుంది,  కానీ చైతన్యం రాదు.  విద్య, మీడియా, సాహిత్యం, రాజకీయాలు, మతం, అన్నీ  కలిసి ఒక సమ సామాజిక విప్లవం చేయాలి.  

గ్రామస్థాయిలో, కుటుంబ, వ్యక్తిగత స్థాయిలో  కుల భావజాలాన్ని  ప్రశ్నించాలి.  అంబేద్కర్ చెప్పినట్టు ‘సామాజిక  ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం శూన్యం’.  మనకు రాజకీయ ప్రజాస్వామ్యం ఉంది. కానీ,  సామాజిక ప్రజాస్వామ్యం లేదు.   కుమ్మెర  ఘటన ఒక ముగింపు కాదు. అది ఒక ఆరంభం.  మన మనసుల్లో  సమ సామాజిక ఉద్యమాన్ని  ప్రారంభించాల్సిన ఆరంభంగా  ఈ ఘటనను  పరిగణించాలి.

-

మన్నారం నాగరాజు, సోషల్​ ఎనలిస్ట్​