ట్రిపుల్ ఐటీ బాసర క్యాంపస్‌‌లో నిధుల వివరాలడిగితే వేధింపులు..

 ట్రిపుల్ ఐటీ బాసర క్యాంపస్‌‌లో నిధుల వివరాలడిగితే వేధింపులు..

బాసర, వెలుగు: ట్రిపుల్ ఐటీ బాసర క్యాంపస్‌‌లో  నిధుల వినియోగంపై వివరాలు అడిగినందుకు అధికారులు తమను వేధిస్తున్నారని విద్యార్థులు  ఆరోపించారు. మంగళవారం వీడియో విడుదల చేసిన విద్యార్థులు, థర్డ్ పార్టీ ఆడిట్ నివేదిక బయటపెట్టే వరకు తమ నిరసన కొనసాగుతుందని ప్రకటించారు. రెండేళ్లుగా ఆర్టీఐ బోర్డులు ఏర్పాటు చేయలేదని, నిధుల వినియోగంపై దరఖాస్తులకు అధికారులు స్పందించడం లేదని వాపోయారు.

సీఎం రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, మంత్రి సీతక్కను కలిసి సమస్యలు వివరించినందుకు తమను కాన్ఫరెన్స్ హాల్‌‌లో బంధించి బెదిరించారని ఆరోపించారు. వర్సిటీకి వస్తున్న నిధులు, గ్రాంట్ల వివరాలు వెల్లడించకుండా ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదన్నారు.  ఈ వ్యవహారంపై వెంటనే విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కొందరు విద్యార్థులకు ఫీజు బకాయిలు ఉన్నాయని, వాటిని అడిగినందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వర్సిటీ అధికారులు చెబుతున్నారు.