తెలంగాణలో గౌడ సామాజిక వర్గం పాత్ర అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. తరతరాలుగా ప్రకృతితో మమేకమై, ప్రాణాలకు తెగించి తాటి, ఈత చెట్లపైకి ఎక్కి కల్లుగీసే ఈ వృత్తి కేవలం ఒక కులవృత్తి మాత్రమే కాదు. ఇది రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక విడదీయలేని భాగం. ఈ రంగం ప్రధానంగా పలు కీలక సమస్యలను ఎదుర్కొంటోంది. అందులో మొదటిది వృత్తిపరమైన ప్రమాదాలు. ఎత్తైన చెట్లపై నుంచి పడిపోవడం వల్ల మరణాలు సంభవించడం లేదా శాశ్వత అంగవైకల్యం పాలవ్వడం గీతన్నల జీవితాల్లో నిత్యకృత్యమైంది.
కాటమయ్య రక్షణ కవచం పథకం ఒక సానుకూల పరిణామంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ బీసీ సంక్షేమశాఖ ద్వారా ఈ కిట్లను దశలవారీగా పంపిణీ చేస్తున్నారు. అధునాతన మోకులను అందించడం ద్వారా ప్రమాదాల తీవ్రతను తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఇవి కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి కార్మికుడికి అందాల్సిన అవసరం ఉంది. సంప్రదాయ పద్ధతులకు ఆధునిక సాంకేతికతను జోడించినప్పుడే ఈ వృత్తి భవిష్యత్తులో నిలబడుతుంది. అలాగే ప్రమాదవశాత్తూ మరణించిన వారి కుటుంబాలకు అందించే బీమా సాయం సకాలంలో అందడం లేదు. బడ్జెట్ విడు దలకాక పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లు వేల సంఖ్యలో ఉండటం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది.
నీరా పాలసీ
నీరా పాలసీని యుద్ధప్రతిపాదికన విస్తృతంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కల్లును కేవలం మత్తు పదార్థంగా చూడకుండా, అత్యంత తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆరోగ్య ప్రదాయినిగా గుర్తించాలి. అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం నీరాలో సమృద్ధిగా ఉండే ఎమినో యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు దీనిని ఒక సూపర్ ఫుడ్ కేటగిరీలో నిలబెడుతున్నాయి. శ్రీలంక, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి దేశాలు తాటి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. అంతర్జాతీయ ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తే, కృత్రిమ ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్ఏ) లేదా లిక్కర్ స్థానంలో నీరాను ఒక ఆరోగ్యకరమైన సహజ పానీయంగా అమ్మవచ్చు.
ఇది అటు పరిశ్రమకు, ఇటు వినియోగదారులకు ఎంతో మేలు చేస్తుంది. నీరాను నిల్వచేసే సాంకేతికతను అభివృద్ధి చేసి, విమానాశ్రయాలు, ఫైవ్ స్టార్ హోటళ్లలో విక్రయించడం ద్వారా ఈ వృత్తికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావచ్చు. అయితే ఈ ప్రక్రియలో కఠినమైన పర్యవేక్షణ వ్యవస్థ చాలా ముఖ్యం. కల్తీని పూర్తిగా నివారించడానికి ప్రతి బాటిల్‌పై క్యూఆర్ కోడ్ ద్వారా దాని మూలాలను గుర్తించే బ్లాక్‌చైన్ టెక్నాలజీని వినియోగించాలి.
వ్యవస్థాగత మార్పులు
దీనిని ఒక పరిశ్రమగా గుర్తించి తాటి బెల్లం, పంచదార తయారీ వంటి అనుబంధ పరిశ్రమలకు భారీగా రాయితీలు కల్పించాలి. తద్వారా నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్న గ్రామీణ యువతను, మహిళలను ఈ గౌరవప్రదమైన వృత్తి వైపు మళ్లించడానికి, వారిలో నూతనోత్సాహాన్ని నింపడానికి ఇది ఒక గొప్ప వేదికగా మారుతుంది. ఐఐటీల వంటి విద్యాసంస్థల సహకారంతో తక్కువ ఖర్చుతో కూడిన సురక్షిత పరికరాలను సామాన్య కార్మికులకు అందుబాటులోకి తీసుకురావాలి.
మరో ముఖ్యమైన ప్రతిపాదన ఏమిటంటే ప్రత్యేక సంక్షేమనిధి ఏర్పాటుతోపాటు, మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో కొంత శాతాన్ని కేటాయించి గీత కార్మికుల కోసం ఒక నిధిని నిర్మించాలి. దీనివల్ల ప్రమాద బాధితులకు లేదా మరణించినవారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపులలో జాప్యం లేకుండా చేయవచ్చు. గీత కార్మికులు ఇప్పుడు కేవలం ఆర్థికసాయం మాత్రమే ఆశించడం లేదు. వారు తమ వృత్తికి గౌరవాన్ని, పనిచేసే చోట భద్రతను కోరుకుంటున్నారు. శాస్త్రీయ పద్ధతులతో కూడిన వృత్తి ప్రోత్సాహం, తక్షణ ఆర్థికభరోసా కల్పించడం ద్వారానే గీతన్నల జీవితాల్లో నిజమైన వెలుగులు నింపగలం.
- డా. కట్కూరి
