- సాధన సమితి ఆధ్వర్యంలో దీక్ష
కడెం, వెలుగు: పొన్కల్ సదర్మాట్ బ్యారేజ్ నుంచి మేడంపల్లి సదర్మాట్ ఆనకట్ట వరకు ప్రత్యేక కాలువ నిర్మించి చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సదర్మాట్ కాలువ సాధన సమితి అధ్యక్షుడు హపావత్ రాజేందర్ డిమాండ్ చేశారు. సదర్మాట్ ఆయకట్టు రైతులతో కలిసి నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో ఒక్క రోజు నిరసన దీక్ష చేపట్టారు. ఖానాపూర్ బార్ అసోసియేషన్ నేతలు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. 55 గేట్లతో సదర్మాట్ బ్యారేజ్ నిర్మాణం చేపట్టినప్పటికీ కాలువలు నిర్మించకపోవడం దారుణమన్నారు. సదర్మాట్ నుంచి వారబంది పద్ధతిలో కాకుండా ప్రతిరోజు నీరు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు.
మరికొద్ది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి బ్యారేజ్ ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో అంతకుముందే ప్రత్యేక కాలువ నిర్మాణం చేపట్టి చివరి ఆయకట్టుకు సాగు నీరు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చెడిపోయిన కాలువలకు రిపేర్లు చేయించాలని కోరారు. అనంతరం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
