- మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్/అక్కన్నపేట,వెలుగు: హుస్నాబాద్ నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం మండల పరిధిలోని జిల్లెలగడ్డ వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే అర్బన్ ఫారెస్ట్ పార్కుకు కలెక్టర్ హైమావతితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కన్నపేట మండలం గౌరవెల్లి నుంచి మల్లారం వరకు బైక్ నడుపుతూ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్లమ్మ చెరువు, మహా సముద్రం గండి, రాయికల్ జలపాతాలతో పాటు అర్బన్ ఫారెస్ట్ పార్క్ నియోజకవర్గ ముఖచిత్రాన్ని మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న కోటలు ఉండడం వల్ల ఈ పార్కుకు సర్దార్ సర్వాయి పాపన్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ అని పేరు పెడుతున్నట్లు ప్రకటించారు.
భైరవ స్వామి గుడి, పాపన్న కోటలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల కోసం వాకింగ్ ట్రాక్, యువత కోసం ప్రత్యేక ట్రెక్కింగ్ మార్గాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గత పాలకులు ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీలిచ్చి కాలయాపన చేశారని, గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ చేసినా చుక్క నీరు రాలేదని విమర్శించారు.
నియోజకవర్గంలో ఇంకా 1200 ఎకరాల భూసేకరణకు రూ. 250 కోట్ల నిధులు అవసరమని దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్సువర్ణ, ఆర్డీవో రామ్మూర్తి, జిల్లా లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఏఎంసీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ చందు, నాయకులు శివయ్య, శ్రీనివాస్, రవీందర్, పద్మ, ఐలయ్య, తదితరులున్నారు.
