కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జిగా ‘వెలిచాల’

కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జిగా ‘వెలిచాల’
  • ఉత్తర్వులు జారీ చేసిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్

కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిగా వెలిచాల రాజేందర్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు చెందిన మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నిరుడు మే 6న అప్పటి ఇన్ చార్జి పురుమల్ల శ్రీనివాస్ ను అధిష్ఠానం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ పదవి గత 8 నెలలుగా ఖాళీగా ఉంది. 

వెలిచాల రాజేందర్ రావుతోపాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పోటీ పడినప్పటికీ చివరికి వెలిచాలనే పదవి వరించింది. తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పని చేస్తానని పేర్కొన్నారు. రాజేందర్ రావును అసెంబ్లీ ఇన్​చార్జిగా నియమించడంతో పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.  

పార్లమెంట్ ఇన్ చార్జిగా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి? 

ఇప్పటివరకు వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ పార్లమెంట్ ఇన్ చార్జిగా కొనసాగారు. ఆయనకు అసెంబ్లీ ఇన్ చార్జి పదవి రావడంతో..  పార్లమెంట్ ఇన్​చార్జిగా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని నియమించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలిసింది. అలాగే బీఆర్ఎస్ హయాంలో కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రజావ్యతిరేక విధానాలపై ఆందోళన కార్యకమాలు నిర్వహించిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి సుడా చైర్మన్ పదవిని మరోసారి రెన్యువల్ చేయనున్నట్లు సమాచారం.