- కేంద్రంపై మండిపడ్డ డీసీసీ ప్రెసిడెంట్లు
- ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్
కోల్‌బెల్ట్/ఆసిఫాబాద్/నిర్మల్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఉపాధి హక్కును కాలరాస్తోందని మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథ్రెడ్డి మండిపడ్డారు. శనివారం మందమర్రిలోని కాంగ్రెస్ క్యాంపు ఆఫీస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు స్వగామాల్లోనే పనిదొరికి వలసలు తగ్గేలా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరేలా కాంగ్రెస్2004లో ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని నేడు బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ స్కీమ్‌తో గతంలో ప్రజలకు ఏడాదిలో 100 రోజుల పనిహక్కు ఉండేదని, కొత్తగా తీసుకొచ్చిన పీబీజీరామ్జీ పథకంలో వ్యవసాయ సీజన్లలో 60 రోజుల పనులపై నిషేధం విధించడంతో కూలీలకు పనులు దొరకడం కష్టమన్నారు. కొత్త చట్టాన్ని రద్దు చేయాలని, పాత చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ఉపేందర్‌గౌడ్, లీడర్లు సుదర్శన్, నర్సింగ్, తిరుమల్‌రెడ్డి, రమేశ్, పాషా, సంతోష్, అర్జున్ మహంతో, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
గాంధీ పేరు పునరుద్ధరించే వరకు పోరాటాలు
దేశ సంపదను, అడవులను బడాబాబులకు కట్టబెడుతూ బీజేపీ ప్రభుత్వం పేదల కడుపు కొడుతోందని ఆసిఫాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ మండిపడ్డారు. శనివారం తన క్యాంప్ ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వీబీజీ రామ్‌జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గాంధీ పేరును యథావిధిగా ఉంచాలని, లేకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. గాడ్సేతో గాంధీని చంపించింది బీజేపీనేని మండిపడ్డారు.
బీజేపీకి పేదల పై ప్రేమ ఉంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఈ నెల 20 నుంచి 30 వరకు గ్రామాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఇరుకల్ల మంగ, నియోజకవర్గ ఇన్ చార్జ్ అజ్మీర శ్యామ్ నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గాదివేణి మల్లేశ్, పార్టీ మండల అధ్యక్షుడు మసాదే చరణ్, ఆత్రం కుసుంరావు, సర్పంచ్ కుంరం వందన తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్ర
పేదప్రజల గుండెల్లో నుంచి మహాత్మగాంధీ పేరును తుడిచివేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఉపాధిహామీ పథకం పేరును మార్చిందని నిర్మల్డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ ఆరోపించారు. నిర్మల్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీహరి రావు అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తాను, తన కుటుంబం కూడా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీ పనిచేశామని, ఆ పథకం ఎంతోమంది పేద కుటుంబాలకు అండగా నిలుస్తోందన్నారు. పథకాన్ని దెబ్బతీసి, పేదల పొట్ట కొట్టేందుకు కేంద్రం మార్పులు చేసిందని.. దాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 20 నుంచి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఆందోళనలను చేపడతామని వెల్లడించారు.
టీపీసీసీ జనరల్ సెక్రటరీ అంబడి రాజేశ్వర్, నిర్మల్ గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు జునైద్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సమర రెడ్డి, నిర్మల్ టౌన్ ప్రెసిడెంట్ చిన్ను, జడ్పీటీసీ ఫోరం అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, భైంసా మార్కెట్‌కమిటీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, ఖానాపూర్ మండల అధ్యక్షుడు దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
