
తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ పేపర్ల లీక్ సంచలనం సృష్టిస్తోంది. వికారాబాద్ జిల్లాలో ఏప్రిల్ 3వ తేది సోమవారం తెలుగు పేపర్ లీక్ కాగా.. 4వ తేదీ మంగళవారం వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ అయ్యింది. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు హిందీ పేపర్ వాట్సాప్ గ్రూప్ ల్లో చక్కర్లు కొట్టింది. అయితే ఈ కేసులో ఇప్పటికే ప్రశాంత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హిందీ పేపర్ వాట్సప్ లో సర్క్యులేట్ చేసిన కేసులో నిందితుడుగా ఉన్న మాజీ జర్నలిస్ట్ ప్రశాంత్ ఎవరి మనిషి అనేదానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నయి. ప్రశాంత్ కరుడు గట్టిన బీజేపీ కార్యకర్త అని బీఆర్ఎస్ మంత్రులు చెబుతుండగా.. ప్రశాంత్ బీఆర్ఎస్ మనిషేనని బీజేపీ నేతలు అంటున్నారు. కాగా గతంలో జర్నలిస్టుగా పని చేసిన ప్రశాంత్ ఇరుపార్టీల లీడర్లతో సన్నిహితంగా ఉన్నాడు. ఆ సమయంలో ఆయన తీసుకున్న ఫోటోలను రెండు పార్టీల నేతలు ఎవరికి వారు అస్త్రంగా వాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్ బాస్కర్ తో నిందితుడు ప్రశాంత్ ఉన్న ఫోటోను షేర్ చేశారు బీజేపీ నేతలు.