హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రెండో రోజు 27 నామినేషన్లు

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రెండో రోజు 27 నామినేషన్లు
  • హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దాఖలు చేసిన అభ్యర్థులు

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో రెండో రోజు శనివారం 11 మంది అభ్యర్థులు14 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థి టి. రాజసింగ్, నాంపల్లి నుంచి బీఆర్ఎస్​క్యాండిడేట్ హింగోల్కర్ సంతోశ్​కుమార్ ( నాలుగు సెట్లు), ముషీరాబాద్ నుంచి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి ముత్యాల రాజేశ్,  మలక్ పేట నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి సయ్యద్ బిలాల్, బీఎస్పీ అభ్యర్థి అల్గోలా రమేశ్, అంబర్ పేట నుంచి  ఇండిపెండెంట్ క్యాండిడేట్ దేవరుప్పల శ్రీకాంత్,  ఖైరతాబాద్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మహ్మద్ జావెద్, జూబ్లీహిల్స్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి సూదిరెడ్డి శివశంకర్ రెడ్డి నామినేషన్లు వేశారు. 

యాకుత్ పురా నుంచి స్వతంత్ర అభ్యర్థులు మహ్మద్ అక్రాం అలీఖాన్, ఎ. సరిత, కంటోన్మెంట్ నుంచి శ్రమ జీవి అభ్యర్థి జాజుల భాస్కర్ నామినేషన్లను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఫస్ట్ రోజు  ఏడుగురి నుంచి 9 సెట్ల నామినేషన్లు వచ్చినది తెలిసిందే. 

రంగారెడ్డి జిల్లాలో 12 మంది

రంగారెడ్డి కలెక్టరేట్: జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాలకు 12 మంది 13 సెట్ల నామినేషన్లను అందజేశారు. ‌‌‌‌-ఇబ్రహీంపట్నం‌‌‌‌-(1), -ఎల్​బీనగర్ (​-2), -మహేశ్వరంలో  నలుగురు అభ్యర్థులు 5 నామినేషన్లు, -రాజేంద్రనగర్ (-1), -శేరిలింగంపల్లి-(2), -చేవెళ్ల-(1) లో  చొప్పున అధికారులకు సమర్పించారు. -కల్వకుర్తి, -షాద్​నగర్​ ఎవరూ వేయలేదు.జిల్లాలో రెండు రోజుల్లో19 మంది 20 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. 

టైమ్ కు వెళ్లినా నామినేషన్ తీసుకోలేదు 

ఇబ్రహీంపట్నం: సమయానికి వెళ్లినా అధికారులు తన నామినేషన్ తీసుకోలేదని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనినిస్ట్ (విప్లవాత్మక స్వరం) (సీపీఐ ఎంఎల్ ఆర్ఐ) బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి ముద్దగొని రాజ్యలక్ష్మి ఆరోపించారు. అబ్దుల్లాపుర్ మెట్​మండలం పసుమాములకు చెందిన రాజ్యలక్ష్మి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీసులో నామినేషన్ వేసేందుకు వెళ్లగా అధికారులు తిరస్కరించారు.  

ఆఫీసులోకి  మధ్యాహ్నం 2.40 గంటలకు వెళ్లినప్పటికీ నామినేషన్ తీసుకోలేదని, అభ్యర్థిని బలపరిచే 10 మందిని విచారణ కేంద్రం సిబ్బంది ధృవీకరించుకుని ఆర్వో వద్దకు పంపారు. అప్పటికే సాయంత్రం 4.06గంటలు కావడంతో నామినేషన్ గడువు 3 గంటలకే ముగిసిందని సోమవారం రావాలని అభ్యర్థికి ఇబ్రహీంపట్నం ఆర్వో అనంత రెడ్డి సూచించారు.  ముందుగానే వచ్చామని  రిటర్నింగ్ సిబ్బంది విచారణ లేట్ చేశారని, దీంతో  నామినేషన్ తీసుకోలేదని ఆమె పేర్కొన్నారు. 

మహేశ్వరంలో కాంగ్రెస్​ నుంచి చిగురింత పారిజాత నామినేషన్     
   
బడంగ్​పేట్​ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి మహేశ్వరం నుంచి నామినేషన్ ను రిటర్నింగ్​ అధికారికి అందజేశారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ ​అభ్యర్థిగా కిచ్చన్నగారి లక్ష్మా రెడ్డి (కేఎల్ఆర్) ని అధిష్టానం ఖరారు చేసింది. కాగా.. మొదట్నించి టికెట్ ​ఆశించగా.. పేరు ప్రకటించలేదు. దీంతో పారిజాత అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా నామినేషన్ వేశారు. తన అనుచరులతో సమావేశమై కాంగ్రెస్ టికెట్‌‌తోనే పోటీలో ఉంటామని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే అయోమయం నెలకొంది.  ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు, ఎల్​బీనగర్ నుంచి బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.