ఏ ఒక్కరు నాకు మద్దతివ్వలేదు... మండలిలో కంటతడి పెట్టిన కవిత..

ఏ ఒక్కరు నాకు మద్దతివ్వలేదు... మండలిలో కంటతడి పెట్టిన కవిత..

సోమవారం ( జనవరి 5 ) శాసనమండలిలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు ఎమ్మెల్సీ కవిత. కుటుంబంలో, పార్టీలో ఏ ఒక్కరు తనకు మద్దతివ్వలేదంటూ కంటతడి పెట్టుకున్నారు కవిత. వ్యక్తి యొక్క భావప్రకటన స్వేచ్ఛను హరించే హక్కు ఏ పార్టీకి లేదని.. గత ఎనిమిదేళ్లుగా తను చేస్తున్న పోరాటానికి అడ్డుకట్ట వేయడానికి మొదటిరోజు నుంచే ప్రయత్నాలు జరిగాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు కవిత. 

ఎక్కడా కూడా తెలంగాణ బిడ్డలను, ప్రజలను నిరుత్సాహ పరచకూడదనే ఇన్నాళ్లు నవ్వుతు పని చేశానని అన్నారు కవిత. ఎప్పుడూ పేద ప్రజల మధ్యనే ఉండి పని చేసానని.. తన దగ్గరికి కాంట్రాక్టర్లు, పైరవీకారులు ఎప్పుడూ రాలేదని.. తన దగ్గరికి వచ్చిన బీడీ కార్మికులు, అంగన్వాడి వర్కర్లు, జీహెచ్ఎంసీ వర్కర్ల లాంటివారికి కాదనకుండా వీలైనంత వరకు పని చేసి పెట్టానని అన్నారు కవిత.

బీఆర్ఎస్ ఏనాడు నాకు మద్దతుగా నిలవలేదని.. బీఆర్ఎస్ చానల్,పేపర్ ఏనాడు నాకు సపోర్ట్ చేయలేదని అన్నారు కవిత. ప్రశ్నిస్తే నన్ను అణగదొక్కారని.. కేసీఆర్ చుట్టూ ఉన్నవాళ్లు నాపై కక్ష గట్టారని... ప్రశ్నించినందుకు నాపై కక్ష గట్టి పార్టీ నుంచి వెళ్లగొట్టారని అన్నారు. 2014లో స్వరాష్ట్రంలో మొదటి బతుకమ్మ నుంచే నాపై ఆంక్షలు మొదలయ్యాయని.. పార్టీలో జరుగుతున్న అవినీతిని ఎప్పటికప్పుడ కేసీఆర్ కు చెప్పానని అన్నారు.

సిరిసిల్ల,సిద్దిపేట, కలెక్టరేట్ల నిర్మాణంలో అవినీతి జరిగితే దిక్కులేదని.. ఉద్యమ కారులను బీఆర్ఎస్ నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు కవిత.1969ఉద్యమ కారులను బీఆర్ఎస్ గుర్తించలేదని.. నీళ్లు,నిధులు నియామకాలకు బీఆర్ఎస్ గండి కొట్టిందని అన్నారు కవిత.