లారీని ఢీకొన్న బ‌స్సు.. 11 మంది నేపాలీ వ‌ల‌స కూలీల మృతి

లారీని ఢీకొన్న బ‌స్సు.. 11 మంది నేపాలీ వ‌ల‌స కూలీల మృతి

క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా భార‌త్ లో ఉండిపోయిన నెపాలీ వ‌ల‌స కూలీలు స్వ‌స్థ‌లాల‌కు వెళ్తుండ‌గా ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. మ‌రికొద్ది గంట‌ల్లో ఇంటికి చేరుతార‌న‌గా, వారు ప్ర‌యాణిస్తున్న బ‌స్సు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ప‌ద‌కొండు మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 22 మందికి గాయాల‌య్యాయి. ఆదివారం అర్ధ‌రాత్రి త‌ర్వాత‌ నేపాల్ లోని బాంకే జిల్లాలో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది.

నేపాల్‌లోని సల్యాన్‌ జిల్లాకు చెందిన కొంతమంది ఉపాధి కోసం భారత్‌లోని ఉత్తరప్రదేశ్ కు వలస వచ్చారు. క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా ప‌నులు లేక‌పోవ‌డంతో స్వ‌స్థ‌లాల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అధికారుల ప‌ర్మిష‌న్ తో ఒక బ‌స్సులో 30 మందికి పైగా వ‌ల‌స కార్మికులు నిన్న నేపాల్ కు ప‌య‌న‌మ‌య్యారు. అర్ధరాత్రి స‌మ‌యం త‌ర్వాత‌ నేపాల్‌లోని బాంకే జిల్లాలోని ఓ ప్రాంతంలో ఆగి ఉన్న లారీని ఆ బ‌స్సు ఢీకొట్టింది. బ‌స్సు వేగం ఎక్కువ‌గా ఉండ‌డంతో రెండు వాహ‌నాలు తుక్కుతుక్కుగా అయ్యాయి. ఈ ప్ర‌మాదంలో 11 మంది అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. మ‌రో 22 మందికి గాయాల‌య్యాయి. వారిలో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

ఈ ఘ‌ట‌నపై స‌మాచారం అందుకున్న నేపాలీ పోలీసులు అక్క‌డికి చేరుకుని స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృతుల‌ను, గాయాలపాలైన వారిని నేపాల్ గంజ్ లోని భేరి హాస్పిట‌ల్ కు త‌ర‌లించామ‌ని చెప్పారు. అతి వేగం కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగింద‌ని ప్రాథ‌మిక అంచానా వేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఓవ‌ర్ స్పీడ్ వ‌ల్ల డ్రైవ‌ర్ కంట్రోల్ కోల్పోయి లారీని ఢీకొట్టి ఉండొచ్చ‌న్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

నేపాలీలు ఉపాధి కోసం భారీగా ఇండియాకు వ‌స్తుంటారు. అయితే క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా వారంతా స్వ‌స్థ‌లాల‌కు వెళ్తున్నారు. అయితే భార‌త్ కార‌ణంగానే నేపాల్ లో క‌రోనా వ్యాపించింద‌ని ఇటీవ‌లే నేపాల్ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలీ వ్యాఖ్య‌లు చేశారు. కాగా, భార‌త్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 1,82,143 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. 5164 మంది మ‌ర‌ణించారు. నేపాల్ లో 1572 కేసులు న‌మోదు కాగా.. ఎనిమిది మంది వైర‌స్ కు బ‌ల‌య్యారు.