భద్రాచలం, వెలుగు: తెలంగాణ బార్డర్‌లోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కర్రెగుట్టల్లో ఆదివారం సాయంత్రం వరుసగా ఆరు చోట్ల ఐఈడీలు పేలాయి. ఈ ఘటనలో 11 మంది జవాన్లు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే రాయ్‌పూర్ ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురికి ఆపరేషన్ చేయగా, మరో 8 మందికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స చేస్తున్నారు.
డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, కోబ్రా బలగాలు కూంబింగ్‌కు వెళ్లిన సమయంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పేలాయి. కోబ్రా సబ్ ఇన్స్ పెక్టర్ రుద్రేశ్ సింహ్‌కు తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరి కాళ్లకు దెబ్బలు తగిలాయి. ముగ్గురు జవాన్ల కళ్లకు కూడా గాయాలయ్యాయి. ఊసూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కర్రెగుట్టల్లో జరిగిన ఈ ఘటనతో భద్రతాబలగాలు ఉలిక్కిపడ్డాయి. బాంబు స్క్వాడ్లతో గుట్టలను జల్లెడపడుతున్నాయి.
