11% మహిళలకు యూరినరీ ఇన్ఫెక్షన్లు.. 6,328 మందిలో 718 మందికి

11% మహిళలకు యూరినరీ ఇన్ఫెక్షన్లు.. 6,328  మందిలో  718 మందికి
  • ‘ఆరోగ్య మహిళ’ క్లినిక్స్​తో బయటపడ్తున్న డిసీజ్​లు 
  • 6,328 మందికి టెస్ట్ చేస్తే.. 718 మందిలో గుర్తింపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘ఆరోగ్య మహిళ’ క్లినిక్‌‌లకు వస్తున్నమహిళల్లో అత్యధికంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (-యూటీఐ) వ్యాధే బయటపడుతోంది. ‘ఆరోగ్య మహిళ’ పేరిట ప్రతి మంగళవారం వంద ప్రభుత్వ దవాఖాన్లలో మహిళల కోసం, పూర్తిగా లేడీ డాక్టర్లు, స్టాఫ్‌‌తో స్పెషల్‌‌ క్లినిక్స్‌‌ నిర్వహిస్తున్నారు. ఈ మంగళవారం క్లినిక్స్‌‌లో టెస్ట్ చేయించుకున్న ప్రతి100 మంది మహిళల్లో 11 మందికి యూరినరీ ట్రాక్ట్‌‌ ఇన్ఫెక్షన్లు ఉన్నట్టుగా గుర్తించామని ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించింది. మొత్తం 6,328 మంది మహిళకు టెస్ట్ చేయగా.. 718(11.34 శాతం) మందికి యూటీఐ ఉన్నట్టు గుర్తించామని, వారందరికీ ట్రీట్‌‌మెంట్ ప్రారంభించామని పేర్కొంది.

మహిళల్లో యూటీఐ సమస్య సహజమే అయినప్పటికీ, కచ్చితంగా ట్రీట్‌‌మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దీర్ఘకాలం పాటు అలాగే ఉంటే, ఇన్ఫెక్షన్ ముదిరి ఇతర సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు. మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి, వాసన రావడం, యూరిన్‌‌ రంగులో మార్పు, బ్లడ్ రావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని వారు సూచిస్తున్నారు.   

24 జిల్లాల్లోని 100 దవాఖాన్లలో టెస్టులు 

రాష్ట్రంలో ప్రతి మంగళవారం నిర్వహించే విమెన్ క్లినిక్స్‌‌లో రకరకాల టెస్టులు ఉచితంగా చేస్తున్నారు. ఈ మంగళవారం 3,753 మందికి బ్రెస్ట్‌‌ కేన్సర్, 884 మందికి గర్భాశయ ముఖద్వార కేన్సర్, 3,783 మందికి నోటి కేన్సర్ టెస్టులు చేశామని ఆరోగ్యశాఖ వెల్లడించింది. మైక్రో న్యూట్రిషన్ డెఫీసియెన్సీ సమస్య ఉన్నట్టుగా భావిస్తున్న 1,029 మందికి ఇందుకు సంబంధించిన టెస్టులు చేశారు. వీటి రిజల్ట్స్ రావాల్సి ఉంది. థైరాయిడ్ ప్రొఫైల్, విటమిన్ డీ, సీబీపీ టెస్టులు కూడా క్లినిక్స్‌‌లో చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 24 జిల్లాల్లో వంద దవాఖాన్లలోనే స్పెషల్ క్లినిక్స్ నిర్వహిస్తుండగా, వీటిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రతి మహిళ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, మహిళలందరూ ఈ అవకాశం వినియోగించుకోవాలని మంత్రి హరీశ్‌‌రావు బుధవారం ఓ ప్రకటనలో కోరారు.