ఆశావహులు మూడు వేలకుపైనే..!మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లు

ఆశావహులు మూడు వేలకుపైనే..!మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లు
  • ప్రధాన పార్టీల నుంచి పోటీలో 1100 మంది
  • ఒక్కో డివిజన్​ నుంచి టికెట్ల కోసం ఐదారు మంది పోటీ
  • మధ్యవర్తుల ద్వారా పార్టీల 
  • హైకమాండ్ ను కలుస్తున్న పలువురు నాయకులు

మహబూబ్​నగర్, వెలుగు :  మహబూబ్​నగర్​ కార్పొరేషన్​లో 60 డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్ల నుంచి పోటీ చేయడానికి ఆశావహుల లిస్ట్ భారీగానే ఉంది. ఇందులో మూ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయాలనుకుంటున్న వారు 1,100 మందికిపైగా ఉండగా.. ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లుగా పోటీలో ఉండాలనుకుంటున్న వారి సంఖ్య మరో రెండు వేలకుపైగానే ఉంది. ఆయా పార్టీల తరఫున ఒక్కో డివిజన్​ నుంచి టికెట్ల కోసం ఐదారు మధ్య పోటీ ఉంది. ఎవరికి ప్రజా బలం ఉందో తేల్చడానికి పార్టీలు సర్వేలు కూడా చేయిస్తున్నాయి.

 ఈ తరుణంలో సర్వే రిపోర్ట్​ ఎలా ఉంటుందో.. రిపోర్టు చూశాకా తమకు హైకమాండ్లు బీఫారాలు ఇస్తాయా..? ఇవ్వవా..? అనే ఆందోళన ఆశావహుల్లో నెలకొంది. అయితే ఈ రిపోర్టులు ఎలా ఉన్నా కచ్చితంగా పార్టీల నుంచి బీ ఫారాలు తెచ్చుకోవాలని కొందరు పైరవీలు ముమ్మరం చేశారు. స్థానిక లీడర్లు.. పార్టీల జిల్లా ఇన్​చార్జీలను కాదని నేరుగా మధ్యవర్తుల ద్వారా హైకమాండ్​ను కలుస్తున్నారు. ఇప్పటికే కొందరు లీడర్లు టికెట్ల కోసం హైదరాబాద్​లోని ఆయా పార్టీల రాష్ర్ట లీడర్లను కలిసి మాట్లాడి హామీలు తీసుకున్నట్లు తెలిసింది. 

పోటీ చేయాలంటే ఫండ్ ఇయ్యాల్సిందే..

కార్పొరేషన్​ పరిధిలోని ఓ రాజకీయ పార్టీలో ఆశావహులకు వింత అనుభవం ఎదురవుతున్నట్లు చర్చ నడుస్తోంది. ఫలానా డివిజన్​ నుంచి పోటీ చేయాలనుకుంటున్నామని ఆశావహులు లీడర్ల వద్దకు వెళితే 'పార్టీ ఫండ్'​ ఇవ్వాలని చెబుతున్నట్లు సమాచారం. ప్రతి డివిజన్ నుంచి పోటీ చేయాలనుకుంటున్న వారు కచ్చితంగా పార్టీ ఫండ్​కింద రూ.5 లక్షలు చెల్లించాలని, వారికే పార్టీ తరఫున బీ ఫారాలు ఇస్తామని చెబుతున్నట్లుతెలిసింది. 

మేం ఖర్చు పెట్టుకోలేం..

నగరంలో మరో రాజకీయ పార్టీ నుంచి బీ ఫారాలు ఆశిస్తున్న లీడర్లు అయోమయంలో పడ్డారు. రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వాల్సిన ఆ పార్టీ లీడర్లు.. 'మీ గెలుపునకు మేమేమి ఖర్చు చేయలేం' అని చెబుతున్నట్లు తెలిసింది. పార్టీ పరంగా కూడా ఎలాంటి ఫండ్ రాదని ఆశావహులకు ముందుగానే స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. 

ఫలానా డివిజన్ నుంచి పోటీ చేయాలని నేతల వద్దకు వస్తున్న ఆశావహులకు ముందునేగా 'మీరు పోటీకి ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారు..? మేం మీ ఎన్నికల ఖర్చులు పెట్టుకోలేం. అలా అయితేనే పార్టీ నుంచి బీ ఫారాలు ఇస్తాం' అని తేల్చి చెబుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.