111 జీవోపై నిర్ణయానికి  కోర్టును గడువు కోరండి

111 జీవోపై నిర్ణయానికి  కోర్టును గడువు కోరండి

అధికారులకు సీఎం ఆదేశం  
హైదరాబాద్‌‌, వెలుగు: ఉస్మాన్‌‌సాగర్‌‌, హిమాయత్‌‌సాగర్‌‌ జంట జలాశయాలు, వాటి పరీవాహక ప్రాంతాలను పరిరక్షించేందుకు తీసుకొచ్చిన జీవో 111పై నిర్ణయం తీసుకోవడానికి చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో మరి కొన్ని రోజులు టైమ్ ఇవ్వాలని కోర్టును కోరాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌‌ చుట్టూరా లక్ష ఎకరాల అటవీ భూమి ఉందని, దానిని పరిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జంట జలాశయాలు, వాటి పరీవాహక ప్రాంతం మొత్తం లెక్కిస్తే గ్రేటర్ కు సమానంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో అస్తవ్యస్తమైన అభివృద్ధి జరిగితే అది జలాశయాలతో పాటు నగరాన్ని కూడా ప్రభావితం చేస్తుందని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్‌‌ ప్రజల భవిష్యత్‌‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని జలాశయాల రక్షణ, అటవీ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు, రియల్‌‌ ఎస్టేట్‌‌పై నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నగర విస్తరణలో భాగంగా సమగ్ర ప్రణాళిక ద్వారా గ్రీన్‌‌ జోన్లు, సీవరేజీ మాస్టర్‌‌ ప్లాన్‌‌, తాగునీటి వ్యవస్థ, విశాలమైన రోడ్లు తదితర సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. వీటన్నింటిపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని, కాబట్టి కోర్టును మరికొంత సమయం కావాలని కోరాలని అధికారులకు సూచించారు.