111 జీవోలో రూల్స్ ఎత్తివేత..!

111 జీవోలో రూల్స్ ఎత్తివేత..!

హైదరాబాద్‌‌, వెలుగు:ఉస్మాన్‌‌ సాగర్‌‌, హిమాయత్‌‌ సాగర్‌‌ పరివాహక ప్రాంతానికి రక్షణగా ఉన్న 111జీవో లోని కొన్ని రూల్స్ ఎత్తివేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 12వ తేదీతో జారీ చేసిన జీవో 69ను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. 2016లో ఏర్పాటు చేసిన హైపవర్‌‌ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఈ సవరణలు చేస్తున్నట్టు పేర్కొంది. ఇటీవల కేబినెట్‌‌ మీటింగ్​లో 111 జీవో ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి  అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఉస్మాన్‌‌సాగర్‌‌, హిమాయత్‌‌ సాగర్‌‌ పరీవాహక ప్రాంతంలోని 84 గ్రామాల్లో ఉన్న 1.32 లక్షల ఎకరాల భూమిలో కాలుష్యకారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, రెసిడెన్షియల్‌‌ కాలనీలు సహా ఇతర నిర్మాణాలు చేపట్టకుండా 1996 మార్చి 8న 111 జీవో జారీ చేశారు. అప్పట్లో హైదరాబాద్‌‌ నగరానికి తాగునీటి కోసం ఈ రెండు జలాశయాలే ఆధారం కావడంతో వాటిలో కాలుష్యకారక వ్యర్థాలు చేరకుండా ఈ జీవో ద్వారా కఠినమైన రూల్స్ పెట్టారు.
వాటిపై ఆధారపడాల్సిన అవసరం లేదు
111 జీవో ప్రకారం హైదరాబాద్‌‌ తాగునీటి అవసరాల్లో జంట జలాశయాల వాటా 27.59 శాతంగా ఉంది. హైదరాబాద్‌‌ మెట్రో వాటర్‌‌ వర్క్స్‌‌ అండ్‌‌ సీవరేజీ బోర్డు నగర తాగునీటి అవసరాల సామర్థ్యాన్ని ఆ జీవో జారీ చేసిన తర్వాత 145 మిలియన్‌‌ గ్యాలన్‌‌ల నుంచి 602 మిలియన్‌‌ గ్యాలన్‌‌లకు పెంచుకుంది. ఇంకో 344 మిలియన్‌‌ గ్యాలన్‌‌ల సామర్థ్యం పెంచుకునే పనులు పురోగతిలో ఉన్నాయి. హైదరాబాద్‌‌ తాగునీటి అవసరాలకు జంట జలాశయాల నుంచి 1.25 శాతానికన్నా తక్కువ నీటిని తీసుకుంటున్నారని వాటర్‌‌ బోర్డు ప్రభుత్వానికి నివేదించింది. తాగునీళ్లకోసం  జంట జలాశయాలపై అంతగా ఆధారపడాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో 111జీవో లోని 3వ పేరాలో ఉన్న రూల్స్ ఎత్తివేస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జంట జలాశయాలు కలుషితం కాకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది. చీఫ్‌‌ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ జంట జలాశయాల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై స్టడీ చేసి ప్రభుత్వానికి నివేదిస్తుందని వెల్లడించారు. ఈ కమిటీలో ఎంఏయూడీ, ఫైనాన్స్‌‌, ఇరిగేషన్‌‌ స్పెషల్‌‌ సీఎస్‌‌లు, హైదరాబాద్‌‌ వాటర్‌‌ బోర్డు ఎండీ, పొల్యూషన్‌‌ కంట్రోల్‌‌ బోర్డు మెంబర్‌‌ సెక్రటరీ, హెచ్‌‌ఎండీఏ ప్లానింగ్‌‌ డైరెక్టర్‌‌ సభ్యులుగా ఉన్నారు.
డైవర్షన్​ చానెళ్లు, పర్మిషన్లు ఎట్ల
సీఎస్‌‌ నేతృత్వంలోని కమిటీ జంట జలాశయాలు కలుషితం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై సర్కారుకి నివేదించాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ సీవరేజీ ట్రీట్‌‌మెంట్‌‌ ప్లాంట్లు నిర్మించాలి, మురుగునీటి మళ్లింపునకు డైవర్షన్‌‌ చానళ్ల నిర్మాణం, భూగర్భ జలాల క్వాలిటీ పరిరక్షించడం, వ్యవసాయ భూముల నుంచి జంట జలాశయాల్లో చేరే నీటి ద్వారా తక్కువ కాలుష్యం వ్యాప్తి చెందేలా చర్యలు చేపట్టడం, నీటి పరిరక్షణ కోసం చేపట్టాల్సిన ఇతర చర్యలపై కమిటీ సూచనలు చేయాల్సి ఉంటుంది. గ్రీన్‌‌ జోన్‌‌ల ఏర్పాటు, జీవో పరిధిలోని గ్రామాల్లో చేపట్టాల్సిన వసతులు, రోడ్లు, డ్రైనేజీలు, ఎస్టీపీలు, డైవర్షన్‌‌ కాలువల నిర్మాణం, ఈ ప్రాంత అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, లే ఔట్లు, బిల్డింగ్‌‌ పర్మిషన్‌‌ల జారీకి తీసుకోవాల్సిన చర్యలు, న్యాయవివాదాలు తలెత్తకుండా ఆ ప్రాంత అభివృద్ధికి అవసరమైన మార్పులు తదితర అంశాలపై కమిటీ టెర్మ్స్‌‌ ఆఫ్‌‌ రిఫరన్సెస్‌‌ రూపొందించి ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంది.