స్పీడ్ పెంచిన బీజేపీ..నేడు తెలంగాణకు 119 మంది వేరే స్టేట్ల ఎమ్మెల్యేలు

స్పీడ్ పెంచిన బీజేపీ..నేడు తెలంగాణకు  119 మంది వేరే స్టేట్ల ఎమ్మెల్యేలు

హైదరాబాద్, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికల టైమ్​ దగ్గర పడుతుండడంతో బీజేపీ స్పీడ్​ పెంచుతోంది. ఈసారి ఎలాగైనా  తెలంగాణలో జెండా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలను బీజేపీ హైకమాండ్ పంపించింది. ఉత్తరప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, కర్నాటక, పుదుచ్చేరి, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 119 మంది ఎమ్మెల్యేలు శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. సికింద్రాబాద్​లోని ఓ ఫంక్షన్ హాల్​లో ‘ఎమ్మెల్యే ప్రవాస్ వర్క్​షాప్’ పేరుతో నిర్వహించిన సమావేశంలో వాళ్లంతా పాల్గొన్నారు. అనంతరం తమకు కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లారు. ఆదివారం నుంచి ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఈ నెల 27 వరకు అక్కడే మకాం వేస్తారు. పార్టీ లోకల్ లీడర్లు, మండల, బూత్ స్థాయి కార్యకర్తలను కలిసి మాట్లాడతారు. 

కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయి? పార్టీ బలోపేతం, బూత్ కమిటీల పనితీరు, వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఉన్న అవకాశాలు, టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది? తదితర విషయాలపై హైకమాండ్​కు నివేదిక అందజేస్తారు. ఆ నివేదికల ఆధారంగానే హైకమాండ్ రాష్ట్రంలో ఎన్నికల వ్యూహాలను రచించనుంది. 

క్యాడర్​లో జోష్ నింపేందుకు.. 

ఈ నెల 27న ఖమ్మంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ నిర్వహించేందుకు రాష్ట్ర బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభలో బీఆర్ఎస్​కు చెందిన దాదాపు 20 మంది అసంతృప్తులు షా సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు బీజేపీలో జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఆ నేతలు తమతో టచ్ లోకి వచ్చారని బీజేపీ ముఖ్య నేతలు అంటున్నారు. ఇక వచ్చే నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్రానికి రావాలని ప్రధాని మోదీని బీజేపీ నేతలు ఆహ్వానించారు. ఈ ఉత్సవాలకు పోయినేడాది అమిత్ షా వచ్చారు. ఈసారి ఎన్నికలు ఉండడంతో, ప్రధాని మోదీని రావాలని కోరారు. ఒకవేళ మోదీ వస్తే, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. ఇలా ఎన్నికల వేళ అగ్రనేతల వరుస టూర్లతో పార్టీ క్యాడర్​లో జోష్ నింపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. 

బీఆర్ఎస్, కాంగ్రెస్ తర్వాతే బీజేపీ లిస్ట్.. 

బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా తర్వాతే తమ అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి టికెట్ రానోళ్లను చేర్చుకుని, తమకు బలమైన అభ్యర్థులు లేనిచోట వాళ్లకు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ రెండు పార్టీలకు చెందిన కొందరు నేతలు తమతో టచ్ ఉన్నారని బీజేపీ రాష్ట్ర నేతలు అంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల తర్వాత.. ఆ పార్టీ ల్లో టికెట్ దక్కనోళ్లు బీజేపీలోకి వచ్చే చాన్స్ ఉంది. అందుకే ఆ రెండు పార్టీల జాబితా విడుదల తర్వాతే తమ జాబితా ప్రకటించాలని బీజేపీ హైకమాండ్ భావి స్తున్నట్టు తెలిసింది. అయితే అమిత్ షా టూర్ సందర్భంగా 20 మంది ముఖ్య నేతలతో కూడిన మొదటి జాబితా విడుదల చేస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో కూడిన మొదటి విడత జాబితా విడుదల చేస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. కానీ దీనిపై ఇంకా స్పష్టత లేదు. 

బీఆర్ఎస్​కు ప్రత్యామ్నాయం బీజేపీనే: కిషన్ రెడ్డి

ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించి, అక్కడి పరిస్థితులు తెలుసుకుంటారని బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. భువనేశ్వర్ ఎంపీ అప్రజిత సారంగీ నేతృత్వంలో జరిగిన ‘ఎమ్మెల్యే ప్రవాస్ వర్క్ షాప్’లో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేల రాకతో పార్టీలో కొత్త ఊపు వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు. ‘‘రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది. ఇక్కడ గెలుపుపై హైకమాండ్ దృష్టి పెట్టింది. బీఆర్ఎస్​కు బీజేపీనే  ప్రత్యామ్నాయమని ప్రజలు భావిస్తున్నారు” అని అన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. తెలంగాణకు తొమ్మిదేండ్లుగా పట్టిన పీడ విరగడ కాబోతున్నదన్నారు. ‘‘ఇన్ని రోజులు రాష్ట్రాన్ని దోచుకుని, ఇప్పుడు ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తం అంటున్నారు. పోలీసులు వెంట లేకుండా కేసీఆర్, కేటీఆర్​లకు ప్రజల్లో తిరిగే దమ్ముందా” అని సవాల్ విసిరారు. వర్క్​షాప్​లో బీజేపీ సీనియర్ నేతలు ప్రకాశ్ జవదేకర్, మురళీధర్ రావు, అరవింద్ మీనన్, ఇంద్రసేనా రెడ్డి  పాల్గొన్నారు.

రాష్ట్రానికి బన్సల్.. 

బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో పర్యటిస్తారు. ఆదివారం హైదరాబాద్​లోని పార్టీ స్టేట్ ఆఫీసులో కొన్ని కమిటీలతో,  సోమవారం ఏడు మోర్చాలతో సమావేశమవుతారు. కూకట్​పల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న జాయినింగ్స్ ప్రోగ్రామ్​లో పాల్గొంటారు.