
దేశం మొత్తం సిటిజన్ షిప్ బిల్లుకు వ్యతిరేకంగా అలర్లు జరుగుతున్నాయి. అయినా కేంద్రం మాత్రం బిల్లును చట్టం చేసింది. అయితే చట్టం చేసిన రెండో రోజే మహారాష్ట్రలో 12 మంది బంగ్లాదేశ్ పౌరులను పోలీసులు అరెస్టు చేశారు.
భారతదేశంలో అక్రమంగా ఉంటున్న 12 మంది బంగ్లాదేశ్ పౌరులను ఏటీసీ పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని బోయిసర్ ప్రాంతంలో ఉంటున్న వీరందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి పత్రాలు లేకుండా భారతదేశంలో చట్టవిరుద్ధంగా ఉంటున్నందుకు తొమ్మిది మంది మహిళలతో సహా పన్నెండు మంది బంగ్లాదేశ్ పౌరులను యాంటీ టెర్రరిజం సెల్ అరెస్టు చేసింది.
ఏటీసీ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ మాన్ సింగ్ పాటిల్ మాట్లాడుతూ.. 12 మంది బంగ్లాదేశ్ పౌరులు బోయిసర్ ప్రాంతంలో అక్రమంగా ఉంటున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. వారి వద్ద భారత్‌లో ఉండటానికి కావలసిన పత్రాలు ఏమీ లేవని ఆయన తెలిపారు. అక్రమంగా ఉంటున్నందుకు వారిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.