
- ఒక్కొక్కటిగా బయటికొస్తున్న అక్రమాలు
- ఇప్పటిదాకా 12 కేసులు.. వెలుగులోకి రానివి ఇంకెన్నో
- రామకృష్ణను బెదిరించినట్లు రాఘవ ఒప్పుకున్నడు: ఏఎస్పీ
- నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించిన మెజిస్ట్రేట్
భద్రాచలం, కొత్తగూడెం, వెలుగు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపుల ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే పలు సెక్షన్ల కింద 12 కేసులు నమోదయ్యాయి. ఇటీవల మరికొన్ని ఫిర్యాదులు కూడా పోలీసులకు వచ్చాయి. రామకృష్ణను బెదిరించినట్లు వనమా రాఘవ ఒప్పుకున్నారని ఏఎస్పీ రోహిత్ రాజు చెప్పారు. నిందితుడిని తీవ్ర ఉద్రిక్తతల నడుమ పాల్వంచ పోలీస్ స్టేషన్ నుంచి కొత్తగూడెం తీసుకెళ్లిన పోలీసులు.. అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో భారీ బందోబస్తు మధ్య రాఘవను భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు. రాఘవపై ఇటీవలి కాలంలో వచ్చిన పలు ఫిర్యాదులపైనా విచారించనున్నట్టు పేర్కొన్నారు. పాల్వంచ పోలీస్ స్టేషన్‌లో శనివారం మీడియాతో ఏఎస్పీ రోహిత్ రాజు మాట్లాడారు. రామకృష్ణ బావమరిది ఎలిశెట్టి జనార్దన్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వనమా రాఘవ, రామకృష్ణ తల్లి సూర్యావతి, సోదరి మాధవిలపై పాల్వంచలో కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. పాల్వంచకు చెందిన రామకృష్ణను తాను బెదిరించినట్లు వనమా రాఘవ ఒప్పుకున్నారని ఏఎస్పీ రోహిత్ రాజు చెప్పారు. రాఘవపై గతంలో 12 కేసులు ఉన్నాయని, వాటిపై ఆయన్ను ప్రశ్నించామని తెలిపారు. రాఘవతోపాటు ముక్తివి గిరీశ్, కొమ్ము మురళీకృష్ణలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. రామకృష్ణ కుటుంబం ఆత్మాహుతి కేసులో వనమా రాఘవ, మండిగ సూర్యావతి, కొమ్మిశెట్టి మాధవి, ముక్తివి గిరీశ్, చావా శ్రీనివాస్, రమాకాంత్, కొమ్ము మురళీకృష్ణలపై కేసు నమోదు చేశామని చెప్పారు. మండిగ సూర్యావతి, కొమ్మిశెట్టి మాధవి, చావా శ్రీనివాస్, రమాకాంత్ పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
- పాల్వంచ మండలం సోనియా నగర్‌లో భూ కబ్జా విషయంలో తనపై వనమా రాఘవ దాడి చేయించారని, ఇబ్బందులకు గురిచేశారంటూ గిరిజన మహిళ భూక్యా జ్యోతి.. రెండేండ్ల కిందట కేసు పెట్టారు. గతేడాది మంత్రి సత్యవతి రాథోడ్‌కు కూడా ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి.. సమగ్ర ఎంక్వైరీకి ఆదేశించారు. కానీ హైదరాబాద్‌లో మంత్రిని ఎమ్మెల్యే వనమా కలిసిన తర్వాత ఏమైందో ఏమో రాఘవకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదంటూ మంత్రి సత్యవతి క్లీన్చిట్ ఇవ్వడం గమనార్హం. దీంతో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను జ్యోతి ఆశ్రయించారు. కేసు పెట్టినప్పుడే పోలీసులు యాక్షన్ తీసుకుని ఉంటే ఐదుగురు రాఘవ బారి నుంచి ప్రాణాలు కాపాడుకునే వారని జ్యోతి అన్నారు. రాఘవపై హత్యాయత్నం కేసు కూడా ఉంది.
- లక్ష్మీదేవిపల్లి మండలంలో ఏడాదిన్నర కిందట పోడు భూముల విషయంలో ఫారెస్ట్ ఆఫీసర్లపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతోపాటు రాఘవ దురుసుగా వ్యవహరించారనే కేసు నమోదైంది. అధికార బలంతో ఫారెస్టు ఆఫీసర్లపై ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడడంతోపాటు అక్కడున్న వారితో దాడి చేయించేలా ప్రోత్సహించినట్టుగా లక్ష్మీదేవిపల్లి పోలీస్‌లకు ఫారెస్టు ఆఫీసర్లు ఫిర్యాదు చేశారు.
- పాల్వంచకు చెందిన మలిపెద్ది వెంకటేశ్వర్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వనమా రాఘవ గతేడాది పంచాయితీ నిర్వహించారు. వెంకటేశ్వర్లు ప్రైవేట్ వ్యక్తుల వద్ద దాదాపు రూ.50 లక్షల విలువైన చిట్టీలు వేశారు. అయితే డబ్బులు ఇచ్చే విషయంలో చిట్టీ నిర్వాహకులు డబ్బులకు బదులు కొంత ల్యాండ్ రాసిచ్చారు. అదే స్థలాన్ని వనమా రాఘవ ప్రోత్సాహంతో మరో వ్యక్తికి రాసిచ్చారు. దీంతో వెంకటేశ్వర్లు ఈ విషయమై చిట్టీ నిర్వాహకులను నిలదీశారు. కానీ రాఘవ అండతో చిట్టీ నిర్వాహకులు వెంకటేశ్వర్లును వేధించారు. దురుసుగా ప్రవర్తించారు. అంతే కాకుండా తనకిచ్చిన ల్యాండ్‌లో కట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో మనోవేదనకు గురైన వెంకటేశ్వర్లు.. చిట్టీ నిర్వాహకులు, రాఘవ పేర్లను సూసైడ్ నోట్‌లో రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసు ఇంకా నడుస్తోంది.
- పాత పాల్వంచకు చెందిన చర్ల చిట్టయ్య అనే వ్యక్తి స్పాంజ్ ఐరన్‌లో పనిచేసే వారు. గుర్తింపు సంఘం ఎన్నికల టైంలో రాఘవ బంధువు పోటీ చేశారు. ఆయనను గెలిపించే క్రమంలో ఓటర్లకు మందు మస్తుగా తాగించారు. అయితే లిక్కర్ ఎక్కువగా తాగి చిట్టయ్య చనిపోయారు. ఎమ్మెల్యే కారులోనే చిట్టయ్య మృతదేహాన్ని తీసుకుని గోదావరిలో పడేశారనే ఆరోపణలున్నాయి. రాఘవపై 1993లో కేసు నమోదైంది. తర్వాత డబ్బులిచ్చి చిట్టయ్య కుటుంబంతో రాజీ చేయించుకున్నారనే విమర్శలున్నాయి.
- కేటీపీఎస్‌లో ఓ ధర్నా సందర్భంగా ఉద్యోగుల డ్యూటీకి ఆటంకం కలిగించారనే కేసు పాల్వంచ పోలీస్ స్టేషన్‌లో నడుస్తోంది.
- పాల్వంచలోని జయమ్మ కాలనీలో ఓ ల్యాండ్ సెటిల్మెంట్ చేసి, బెదిరించి రెండు ఎకరాలు తీసుకున్నారనే ఆరోపణలు రాఘవపై ఉన్నాయి.
- కొత్తగూడెం నియోజకవర్గంలో సెటిల్మెంట్స్తో వచ్చిన డబ్బుతో ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, చీరాల తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి.