హోలీ వేడుకల్లో విషాదం..స్నానాలకు వెళ్లి 12 మంది మృతి

హోలీ వేడుకల్లో విషాదం..స్నానాలకు వెళ్లి 12 మంది మృతి
  • హోలీ వేడుకల్లో విషాదం.. వేర్వేరు చోట్ల ప్రమాదాలు
  • వార్దా నదిలో ఈతకు వెళ్లి చనిపోయిన నలుగురు యువకులు
  • కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా నదీమాబాద్​లో ఘటన 
  • మంచిర్యాల జిల్లా పాతమామిడిపెళ్లిలో ఇంటర్ స్టూడెంట్..
  • నారాయణపేట జిల్లాలో నీళ్ల ట్యాంకు కూలి  చిన్నారి మృతి

కాగజ్ నగర్, వెలుగు నెట్​వర్క్​: హోలీ ఆడిన తర్వాత నది, చెరువు, వాగుల్లో స్నానానికి వెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 12 మంది చనిపోయారు. మృతుల్లో పదేండ్ల పాప, బాలుడు కూడా ఉన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నలుగురు యువకులు వార్దా నదిలో ఈతకు వెళ్లి ఒకరి తర్వాత ఒకరు మునిగిపోయారు. హనుమకొండ జిల్లాలోని ఎస్సారెస్పీ కెనాల్​లో మునిగి ఇద్దరు చనిపోగా.. ఒకరు గల్లంతయ్యారు. మంచిర్యాల జిల్లాలో ఇంటర్ స్టూడెంట్ కెనాల్​లో స్నానానికి దిగి ఈత రాకపోవడంతో మృతి చెందాడు.

అదేవిధంగా, మహబూబాబాద్ జిల్లాలో పదేండ్ల బాలుడు, నారాయణపేట జిల్లా కేంద్రంలో పదేండ్ల చిన్నారి చనిపోయింది. ఆదిలాబాద్ టౌన్, జగిత్యాల జిల్లా రాయికల్​తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకరు చొప్పున మృతి చెందారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం నదీమాబాద్​కు చెందిన నలుగురు, తలోది గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు సోమవారం మధ్యాహ్నం వరకు హోలీ ఆడారు. తర్వాత స్నానం చేసేందుకు ఆరుగురు కలిసి తాటిపల్లి దగ్గరున్న వార్దానదిలో దిగారు. వీరిలో పసల సంతోష్​, మేడి నవీన్ వెంటనే స్నానం చేసి బయటికొచ్చేశారు.

నవీన్ బైక్ తీసుకొని ఇంటికెళ్లిపోగా.. సంతోష్ ఒడ్డు మీదే ఫోన్ చూస్తూ ఉన్నాడు. అదే టైమ్​లో ఆలం సాయి (22), ఉప్పల సంతోష్ (24), ఏలుముల ప్రవీణ్ (24), పనాస కమలాకర్ (24) నదిలో స్నానం చేస్తూ మరింత లోపలికి వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండటంతో పాటు నది ఉధృతంగా ప్రహహిస్తుండటంతో నలుగురు మునిగిపోయారు. ఒడ్డు మీద కూర్చున్న సంతోష్​కు ఈత రాకపోవడంతో ఏం చేయలేకపోయాడు. వెంటనే ఊళ్లోకి వెళ్లి చెప్పాడు. స్థానికులు వచ్చేసరికే నలుగురు గల్లంతయ్యారు.  కౌటాల సీఐ సాధిక్ పాషా గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చేపట్టారు. గంటన్నర తర్వాత నలుగురి డెడ్​బాడీలను బయటికి తీశారు.

కెనాల్​లో స్నానానికి వెళ్లి యువకుడు మృతి

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పాతమామిడిపెళ్లిలో ఇంటర్ స్టూడెంట్ ఈతకు వెళ్లి చనిపోయాడు. జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన కార్తిక్ (17) సమ్మర్ హాలిడేస్ కావడంతో అమ్మమ్మ ఊరైన పాతమామిడిపెళ్లికి శుక్రవారం వచ్చాడు. సోమవారం హోలీ ఆడాడు. తానిమడుగు గ్రామ సమీపంలో ఉన్న లిఫ్ట్ కెనాల్​లో ఫ్రెండ్స్​తో కలిసి స్నానానికి వెళ్లాడు. ఈత రాకపోవడంతో చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం లక్షేటిపేట గవర్నమెట్ హాస్పిటల్​కు తరలించారు. మృతుడి తండ్రి బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. తల్లి అశ్విని ఫిర్యాదు మేరకు దండేపల్లి ఎస్ఐ స్వరూప్ రాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.

రామన్నగూడెంలో పదేండ్ల బాలుడు..

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెం గ్రామంలో చెరువులో ఈతకు వెళ్లి బాలుడు చనిపోయాడు. గ్రామానికి చెందిన అబ్బోరి వినోద్ రెడ్డి కొడుకు రుత్విక్ రెడ్డి (10) ఫ్రెండ్స్ తో కలిసి హోలీ ఆడాడు. తర్వాత దగ్గర్లోని గణేశ్ చెరువులో స్నానం చేసేందుకు దిగాడు. ఈత రాకపోవడంతో మునిగి చనిపోయాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీశ్ చెప్పారు.

వాగులో స్నానానికి దిగి బాలుడు.. 

ఆదిలాబాద్ పట్టణంలో గుమ్ముల సాత్విక్ (14) వాగులో ఈతకు వెళ్లి చనిపోయాడు. పట్టణంలోని జై జవాన్ నగర్​కు చెందిన గుమ్ముల స్వర్ణలత కొడుకు సాత్విక్ సోమవారం హోలీ ఆడాడు. తర్వాత స్నానం చేసేందుకు ఐదారుగురు ఫ్రెండ్స్​తో కలిసి భీంసరి వాగుకు వెళ్లాడు. పిల్లలు ఒడ్డు మీదే నిలబడి ఉండగా.. సాత్విక్ వాగులో దిగాడు. ఈత రాకపోవడంతో చనిపోయాడు. స్థానికులు వెంటనే బాలుడిని బయటికి తీసి రిమ్స్ హాస్పిటల్​కు తీసుకెళ్లినా.. అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. 

జగిత్యాల జిల్లాలో బావిలో పడి యువకుడు..

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన నర్ర నగేశ్‌‌‌‌‌‌‌‌ (21) బావిలో మునిగి చనిపోయాడు. సోమవారం సాయంత్రం దాకా ఫ్రెండ్స్​తో హోలీ ఆడిన నగేశ్.. స్నానం చేసేందుకు వీరాపూర్​ రోడ్డులోని ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో చనిపోయాడు. 2 గంటలు వెతికి డెడ్​బాడీని పోలీసులు, ఫైర్ స్టేషన్ సిబ్బంది బయటికి తీశారు. 

హనుమకొండలో ఇద్దరు మృతి..

హనుమకొండ జిల్లా పలివెల్పుల శివారులో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా.. ఒకరు గల్లంతయ్యారు. కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన బ్రహ్మచారి (27) పలివేల్పుల ఎస్సారెస్పీ కెనాల్ లో పడి గల్లంతయ్యాడు. ఆత్మకూరు మండలం ఊరుకొండ గ్రామానికి చెందిన కేదారేశ్వర, క్రాంతి సోమవారం సాయంత్రం కెనాల్ లో స్నానానికి వెళ్లి చనిపోయారు. కాకతీయ యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరు

మృతుల్లో ప్రవీణ్​కు పెళ్లై ఒక కొడుకు ఉన్నాడు. సాయి, సంతోష్, కమలాకర్​కు పెండ్లిళ్లు కాలేవు. ఆలం సాయి డిగ్రీ కంప్లీట్ చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఉప్పల సంతోష్ స్థానికంగా ఉన్న రైస్ మిల్లులో వర్క్ చేస్తున్నాడు. కమలాకర్ రైస్ మిల్లులో డ్రైవర్​గా పని చేస్తున్నాడు. నలుగురి డెడ్​బాడీలను చూసి కుటుంబ సభ్యుల కన్నీరుమున్నీరయ్యారు. ‘ఇంట్లో నీళ్లు తాగి వస్తివి కదా కొడుకా.. మళ్లీ ఈ గంగ నీళ్లు తాగి దూరమైతివి కొడుకా..’’ అంటూ కమలాకర్ మృతదేహంపై తల్లి ఏడ్వడం అక్కడివాళ్లను కంటతడి పెట్టించింది. ప్రవీణ్​కు మూడేండ్ల కింద వకుళతో పెండ్లైంది. ఏడాది వయస్సున్న దేవాన్ష్ కొడుకు ఉన్నాడు. ఘటనా స్థలాన్ని ఎస్పీ సురేశ్ కుమార్, డీఎస్పీ కరుణాకర్ పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులను విషయం అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం తర్వాత నలుగురి డెడ్​బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

నీళ్ల ట్యాంక్ కూలి చిన్నారి మృతి

ముఖానికి అంటుకున్న రంగులు వాష్ చేసుకు నేందుకు వెళ్లిన ఓ చిన్నారి.. ట్యాంక్ కూలిపోవడంతో చనిపోయింది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని గోపాల్​పేట కాలనీకి చెందిన లక్ష్మి ప్రణతి (10), మరో ముగ్గురు పిల్లలతో కలిసి హోలీ ఆడింది. రంగులు వాష్ చేసుకునేందుకు కాలనీలో ఉన్న ట్యాంకు వద్దకు వెళ్లింది. పాత ట్యాంకు కావడంతో ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో లక్ష్మి ప్రణతి స్పాట్​లోనే చనిపోయింది. మరో చిన్నారికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఈత రాకపోవడంతో యువకుడు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీకి చెందిన రాంబాబు (25) ఫ్రెండ్స్​తో కలిసి హోలీ ఆడాడు. తర్వాత లక్ష్మిదేవిపల్లి మండలంలోని సాటివారి గూడెంలో ఉంటున్న చిన్నాన్న కొడుకైన అభిరామ్ ఇంటికెళ్లాడు. అక్కడే రెస్ట్ తీసుకుంటున్న రాంబాబు వద్దకు ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు. అక్కడి నుంచి దగ్గరలోని వాగులో స్నానం చేసేందుకు వెళ్లారు. ఈత రాకపోవడంతో రాంబాబు చనిపోయాడు. డెడ్​బాడీని బయటికి తీసి కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్​లో పోస్టుమార్టం తర్వాత పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. పాల్వంచ మండలం ఉల్వనూరు ప్రాంతానికి చెందిన అరుణతో రాంబాబుకు ఆరేండ్ల కింద పెండ్లైంది. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో.. కొద్ది రోజుల కింద ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.