ఆంధ్రాబ్యాంక్ ​లోన్​ ఫ్రాడ్ కేసులో 12 మంది రిమాండ్

ఆంధ్రాబ్యాంక్ ​లోన్​ ఫ్రాడ్ కేసులో 12 మంది రిమాండ్

రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని ఆంధ్రా బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసులో 12 మందిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించారు. సీఐ కట్టా నరేందర్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్​నగర్​ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్​లో 15 కంపెనీలకు చెందిన వ్యక్తులు 2016లో బిజినెస్​లోన్లు తీసుకున్నారు. లోన్ల ష్యూరిటీ కింద బ్యాంకులో పెట్టిన ప్రాపర్టీల విలువలు ఎక్కువ చూపించారు. 

కొన్నింటికి సరైన పత్రాలు లేకపోయినా అప్పటి మేనేజర్​ రూప, మరో ఇద్దరు సిబ్బంది లోన్లు తీసుకున్న వారికి సహకరించారు. మొత్తంగా దాదాపు రూ.27 కోట్ల లోన్లను వారికి ఇప్పించారు. 2021లో ఆంధ్రాబ్యాంక్​ యూనియన్​ బ్యాంక్​గా మారడంతో ఆడిట్​లో భాగంగా ఈ లోన్​ వ్యవహారం బయటపడింది. దీంతో సంబంధిత అధికారులు ఆర్సీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి మంగళవారం లోన్​ఫ్రాడ్​తో సంబంధం ఉన్న 12 మందిని అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించారు.