రైస్ మిల్లర్ల వద్దనే యాసంగి ధాన్యం..2022–23కు చెందిన వడ్లు పక్కదారి!

రైస్ మిల్లర్ల వద్దనే యాసంగి ధాన్యం..2022–23కు చెందిన వడ్లు పక్కదారి!
  • మొత్తం ధాన్యం విలువ రూ.301 కోట్లు
  • 17,415 ఎమ్ టీ ఎస్ లు మాత్రమే రికవరీ చేసుకున్న కాంట్రాక్టర్
  • రికవరీ ధాన్యం విలువ రూ.35 కోట్లు
  • మిగతా రూ.265.91 కోట్ల విలువైన ధాన్యంపై అయోమయం

నిర్మల్, వెలుగు: రైస్ మిల్లర్ల వద్ద ఉన్న 2022–23కు సంబంధించి సీఎంఆర్ ధాన్యం అమ్మేందుకు సంబంధిత శాఖ నిర్వహించిన టెండర్ ప్రక్రియ సందేహాలను రేకెత్తిస్తోంది. నిర్మల్ జిల్లాలోని 12 రైస్ మిల్లులు 2022–23 యాసంగి సీజన్​కు సంబంధించిన సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా పెండింగ్​లో పెట్టాయి. సంబంధిత అధికారులు పలుసార్లు ఈ మిల్లులను తనిఖీ చేసి ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలంటూ హెచ్చరించి గడువు విధించారు. 

అయినా మిల్లర్లు ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా జాప్యం చేశారు.సీఎంఆర్​ ధాన్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో .. టెండర్​ నిర్వహించింది. టెంటర్​ దక్కించుకున్న కాంట్రాక్టర్​ మొత్తం డబ్బును ప్రభుత్వానికి చెల్లించలేదు. అయితే రైస్ మిల్లర్లు, కాంట్రాక్ట్ లోపాయికారి ఒప్పందం చేసుకొని ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెడ్తున్నట్లు ఆరోపణలు వెళ్లువెత్తాయి. 

ధాన్యం మొత్తం విలువను రూ.301 కోట్లు

2022–23 యాసంగి సీఎంఆర్​ ధాన్యాన్ని విక్రయించేందుకు పౌరసరఫరాల శాఖ టెండర్లను పిలిచింది. మొత్తం లక్షా 49 వేల 294 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని టెండర్ ద్వారా వేలం నిర్వహించారు. ధాన్యం మొత్తం విలువను రూ.301 కోట్లుగా నిర్ధారించారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ రైస్ మిల్లర్ల వద్ద నుంచి ధాన్యాన్ని సేకరిస్తూ దానికనుగుణంగా ప్రభుత్వానికి రూ.301 కోట్లు చెల్లించాల్సి ఉంది. 

అయితే తమ వద్ద నిలువలు లేకపోవడంతో రైస్ మిల్లర్లు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ తోనే మిలాఖత్ అయినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటివరకు సంబంధిత కాంట్రాక్టర్ రైస్ మిల్లర్ల నుండి కేవలం 17, 415 టన్నుల ధాన్యాన్ని మాత్రమే రికవరీ చేశారని, ఆ ధాన్య విలువ మొత్తం రూ.35 కోట్ల మాత్రమే. ఇంకా లక్షా 31 వేల 879 ధాన్యానికి సంబంధించి రూ.265.91 కోట్లు ప్రభుత్వానికి రావాల్సి ఉంది. 

గడువు ముగిసి 50 రోజులు 

అయితే సదరు కాంట్రాక్టర్ రైస్ మిల్లర్ల నుంచి మిగతా ధాన్యాన్ని ఇప్పటికీ లిఫ్టింగ్ చేయకపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు ఇంకా రాలేదు. దీంతో  సంబంధిత శాఖ అధికారులు కాంట్రాక్టర్ కు, రైస్ మిల్లర్లకు తాకీదులు కూడా జారీ చేశారు. దీంతోపాటు గత నెల జూన్ 10 లోగా మొత్తం ధాన్యాన్ని లిఫ్టింగ్ చేయాల్సిందిగా కాంట్రాక్టర్ కు హెచ్చరికలు జారీ చేశారు. గడువు ముగిసి 50 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఈ ధాన్యం లిఫ్టింగ్ వ్యవహారం పూర్తి కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

 ప్రభుత్వానికి రావలసిన రూ.265.91 కోట్లపై సందిగ్ధత ఏర్పడింది. రైస్ మిల్లర్ల నుండి ఎప్పటికప్పుడు సీఎంఆర్ ధాన్యాన్ని లిఫ్టింగ్ చేసి దానికి అనుగుణంగా ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాల్సి ఉండగా సదరు కాంట్రాక్టర్ అర్ధాంతరంగా ఆ ప్రక్రియను నిలిపివేయడం పై ఉన్నతాధికారులు తదుపరి చర్యల కోసం సమీక్షిస్తున్నారు. 

తలెత్తుతున్న సందేహాలు..

ధాన్యం టెండర్ దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్, ధాన్యాన్ని అప్పజెప్పాల్సిన మిల్లర్ల మధ్య సయోధ్య కుదిరినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొదట్లో కాంట్రాక్టర్ మిల్లర్ల నుంచి ధాన్యం లిఫ్టింగ్ చేసినప్పటికీ ఆ తర్వాత ప్రక్రియను నిలిపివేసి రహస్య ఒప్పందం చేసుకున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. టెండర్ నిబంధన ప్రకారం సదరు కాంట్రాక్టర్ క్వింటాలు ధాన్యానికి రూ.2,016 చొప్పున ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. 

అయితే రైస్ మిల్లర్ల వద్ద అప్పటి ధాన్యం నిల్వలు లేకపోవడంతో తప్పుడు రికార్డులు చూపారని ఆరోపణలున్నాయి. అధికారులకు లిఫ్టింగ్ చేసినట్లు ఆధారాలు చూపినట్లు తెలుస్తోంది. మిగతా ధాన్యానికి సంబంధించి ప్రభుత్వానికి రావలసిన రూ.265.91 కోట్లపై అయోమయం నెలకొంది.