
- తాజాగా ఎస్టీఎఫ్ అదుపులో యూపీకి చెందిన వ్యాపారి
చండీగఢ్/లక్నో: ఇండియాలో ఉంటూ ఇక్కడి రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేస్తున్న యూపీకి చెందిన ఓ వ్యాపారిని స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. రాంపూర్‌లో నివాసం ఉంటున్న బిజినెస్మెన్ షెహజాద్.. పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) తరఫున పని చేస్తున్నట్లు ఎస్టీఎఫ్ గుర్తించింది. కాగా, 2 వారాల్లో పంజాబ్ నుంచి ఆరుగురు, హర్యానా నుంచి నలుగురు, యూపీ నుంచి ఇద్దరు మొత్తం 12 మంది పాకిస్తాన్ ఏజెంట్లను ఎస్టీఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఐఎస్ఐకు స్పైలుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. నార్త్ ఇండియాలోని కీలక సమాచారం అంతా పాకిస్తాన్‌కు చేరవేస్తున్నట్లు నిర్ధారించారు. తాజాగా, షెహజాద్‌ను యూపీలోని మొరాదాబాద్‌లో ఎస్టీఎఫ్ అదుపులోకి తీసుకున్నది. దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం మొత్తం తన హ్యాండ్లర్ ద్వారా ఐఎస్ఐకు చేరవేసేవాడు. ఏడాది కాలంలో పలుమార్లు పాకిస్తాన్ వెళ్లి వచ్చాడు.
స్మగ్లింగ్ ద్వారా సమాచారం చేరవేత
బట్టలు, కాస్మోటిక్స్, మసాలాలు వంటి వస్తువులను షెహజాద్ ఇండియా నుంచి పాక్‌కు స్మగ్లింగ్ చేసేవాడు. వీటి ద్వారానే కీలక సమాచారం మొత్తం ఐఎస్ఐకు చేరవేసేవాడనే ఆరోపణలు ఉన్నాయి. యూపీలోని పలు పట్టణాలతో పాటు రాంపూర్ నుంచి కొంత మంది యువకులను ఐఎస్ఐ కోసం రిక్రూట్ చేశాడు. షెహజాద్‌పై బీఎన్ఎస్ సెక్షన్లు 148, 152 కింద లక్నోలోని ఏటీఎస్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. అతన్ని మొరాదాబాద్ కోర్టులో హాజరుపరిచారు.
హర్యానాలో 2 రోజుల్లో ఇద్దరు అరెస్ట్
హర్యానాలోని నుహ్ జిల్లా తౌరు మండలంలోని కంగర్కా గ్రామానికి చెందిన మొహమ్మద్ తారిఫ్ ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. 2 రోజుల కింద నూహ్ జిల్లాలోని రాజక గ్రామానికి చెందిన 26 ఏండ్ల అర్మాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.