దంపతులను కట్టేసి 12 తులాల గోల్డ్​, రూ.70 వేల నగదు చోరీ

దంపతులను కట్టేసి 12 తులాల గోల్డ్​,  రూ.70 వేల నగదు చోరీ
  • రాత్రి 10 గంటలకే పని కానిచ్చిన దొంగలు
  • ఫోన్​ చేసిన గంటన్నరకు వచ్చిన పోలీసులు

దమ్మపేట వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చెడ్డీలు, బనియన్లు వేసుకుని వచ్చిన నలుగురు దొంగలు దంపతులను బెదిరించి బంగారం, నగదుతో పరారయ్యారు. బాధితుల కథనం ప్రకారం దమ్మపేట మండలంలోని రంగువారిగూడెం గ్రామానికి చెందిన గుట్టిపూళ్ల ప్రభాకర్ రావు, రాజ్యలక్ష్మి దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు అమెరికాలో..కొడుకు బెంగళూరులో సెటిలయ్యారు. ప్రభాకర్ పామాయిల్ సాగు చేసుకుంటూ రంగువారిగూడెంలో ఉంటున్నాడు. ఆదివారం రాత్రి 10 గంటల టైంలో దంపతులిద్దరూ టీవీ చూస్తుండగా ఎవరో తలుపు కొట్టారు.  పనివాళ్లెవరైనా వచ్చి ఉంటారని అనుకున్న ప్రభాకర్ ​భార్య వెళ్లి తలుపు తీసింది. మాస్క్​లు పెట్టుకుని చెడ్డీలు, బనియన్లు వేసుకున్న నలుగురు యువకులు కత్తులు, కర్రలు, రాడ్లు చూపించి లోపలకు వచ్చారు. అరిస్తే చంపేస్తామని  బెదిరిస్తూ వచ్చీరాని తెలుగులో మాట్లాడి తాళ్లతో కట్టేశారు. ప్రభాకర్ మెడలో గొలుసు, ఉంగరాలు, రాజ్యలక్ష్మి మెడలోని బంగారు తాడు, గాజులు లాక్కున్నారు. బీరువాలో ఉన్న బంగారం, రూ.70 వేల నగదు తీసుకున్నారు. సుమారు 1 గంట వరకు వెతికినా ఏమీ దొరక్కపోవడంతో కట్లు విప్పారు. తాము బయటే ఉంటామని అరిస్తే లోపలకు వచ్చి చంపేస్తామని చెప్పి ఉడాయించారు. అర్ధరాత్రి రెండు గంటల వరకు సైలెన్స్​గా ఉన్న వారు ధైర్యం చేసి చుట్టుపక్కల వారిని పిలిచి విషయం చెప్పారు. 12 తులాల బంగారం , 70 వేల క్యాష్​ ఎత్తుకెళ్లారని చెప్పారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

నింపాదిగా వచ్చిన కానిస్టేబుల్స్​ 

దొంగతనం గురించి గ్రామస్తులు సుమారు అర్ధరాత్రి రెండు గంటలకు దమ్మపేట పోలీసులకు ఫోన్​చేసి చెప్పగా వారు నింపాదిగా మూడున్నర గంటలకు వచ్చారు. గ్రామానికి పోలీస్​స్టేషన్​పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా రావడానికి 30 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. కానీ, ఇద్దరు కానిస్టేబుల్స్​ లాఠీలు పట్టుకుని గంటన్నర తర్వాత వచ్చారు.  ఎస్ఐ శ్రావణ్​కుమార్  భద్రాచంలో డ్యూటీలో ఉండడంతో రాలేదని చెప్పారు. ఉదయం తొమ్మిది గంటలకు సీఐ బాలకృష్ణ వచ్చి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్​టీమ్​ను రప్పించి ఫింగర్ ​ప్రింట్స్​తీసుకున్నారు.  సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించినా నిందితులు మాస్క్​లు పెట్టుకుని ఉండడంతో గుర్తుపట్టడం వీలు కాలేదు. ఇదిలా ఉండగా, అశ్వారావుపేటలో కొన్ని రోజులుగా అర్ధరాత్రి వేళ ఇండ్ల వద్దకు వచ్చి తలుపులు కొడుతున్నారని, చిన్నపిల్లల్లాగా ఏడుస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. నాలుగు రోజుల కింద అశ్వారావుపేట పీఎస్ ​ఎదురుగా ఉన్న ఆర్​అండ్​బీ గెస్ట్ హౌస్​ రోడ్డులో  గుర్తు తెలియని వ్యక్తులు ఒకరి ఇంటి తలుపు కొట్టగా తీయలేదు. చుట్టుపక్కల వారికి ఫోన్​ చేసి చెప్పగా వారు వచ్చే లోపు పారిపోయారని తెలిసింది.