రైతుల గోస పట్టించుకోరా? : షర్మిల

రైతుల గోస పట్టించుకోరా? : షర్మిల

హైదరాబాద్, వెలుగు: రూ.12 వేల కోట్ల వడ్ల కొనుగోలు పైసలను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని వైఎస్సార్​టీపీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. ఐకేపీ కేంద్రాల్లో రోజుల తరబడి వెయిట్ చేసి వడ్లు అమ్మారని.. ఇపుడు ఆ వడ్లకు ప్రభుత్వం నగదు ఇవ్వటం లేదని బుధవారం ట్వీట్ చేశారు. తడిసిన ధాన్యంతో సహా ఆఖరి గింజ వరకు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. వడ్ల పైసలు ఇంకా జమ కాకపోవడంతో  రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఐకేపీ కేంద్రాల వద్ద రైతులు చనిపోతున్నా కేసీఆర్ కు చలనం లేదని, రివ్యూ చేయటం, ఆరా తీయటం చేయటం లేదని  ఆమె ఆరోపించారు.

వడ్లు కొనాలని రైతులు ధర్నాలు చేస్తుంటే.. అవన్ని నాటకాలంటూ ఓ మంత్రి అపహస్యం చేశారని ఫైర్ అయ్యారు. మరో మంత్రి 50 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నట్లు జబ్బలు చర్చుకుంటున్నాడని షర్మిల ఎద్దేవా చేశారు. 1.30 లక్షల టన్నుల ధాన్యం పండితే.. అందులో సగం కూడా కొనక పోవడం రికార్డ్ అంటరా అని ప్రశ్నించారు. రెండు నెలల్లో 50 లక్షల టన్నులు కొన్న కేసీఆర్..వర్షాకాలం నేపథ్యంలో వారంలో 30 లక్షల టన్నులు కొనగలరా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

9 ఏండ్లల్లో 9 వేల మంది రైతులను బలి తీసుకోవడమే బీఆర్ఎస్ సాధించిన రికార్డ్ అని విమర్శించారు. 9 ఏండ్లలో 14 వేల కోట్ల పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రికార్డ్ క్రియేట్ చేశారని ఎద్దేవా చేశారు. అందుకే బీఆర్ఎస్  అంటే... "బరాబర్ రైతు సావుకొరే పార్టీ" అని షర్మిల పేర్కొన్నారు.