పోతిరెడ్డిపాడు రాయలసీమ ప్రాజెక్టుల కోసం  12 వేల క్యూసెక్కులు విడుదల

పోతిరెడ్డిపాడు రాయలసీమ ప్రాజెక్టుల కోసం  12 వేల క్యూసెక్కులు విడుదల
  • పోతిరెడ్డిపాడు రాయలసీమ ప్రాజెక్టుల కోసం  12 వేల క్యూసెక్కులు విడుదల
  • వాటర్ రిలీజ్ ఆర్డర్ లేకుండానే గేట్లు ఎత్తిన ఏపీ
  • నియంత్రించే ప్రయత్నం చేయని కేఆర్ఎంబీ

హైదరాబాద్, వెలుగు: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లను ఏపీ ఏకపక్షంగా ఎత్తింది. రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చేందుకు 12 వేల క్యూసెక్కులను రిలీజ్ చేస్తున్నది. కృష్ణా రివర్ మేనేజ్‌‌‌‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నుంచి ఎలాంటి రిలీజ్ ఆర్డర్​లేకున్నా నీటిని తరలించుకుపోతున్నది. పోతిరెడ్డిపాడు నుంచి 16 టీఎంసీలు తీసుకుంటామని బోర్డుకు ఇండెంట్​ఇచ్చిన ఏపీ.. ఇందుకు సంబంధించిన రిలీజ్ ఆర్డర్​ కోసం వేచి చూడకుండానే హెడ్ ​రెగ్యులేటర్​ గేట్లు ఓపెన్ ​చేసింది.  శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే కరెంట్​ఉత్పతి కోసం. దీనికి విరుద్ధంగా నీటి తరలింపు మొదలు పెట్టింది. ఇంత జరుగుతున్నా ఏపీని కేఆర్ఎంబీ నియంత్రించే ప్రయత్నమే చేయలేదు. ‘ఏపీ నీళ్లు ఇవ్వాలని కోరుతున్నది. మీ అభిప్రాయం ఏమిటి’ అని తెలంగాణకు లేఖ రాసింది.

తెలంగాణ కరెంట్​ఉత్పత్తిపై అక్కసు

కృష్ణా బేసిన్‌‌‌‌లోని ప్రాజెక్టులకు ఇప్పటి వరకు పెద్దగా వరద రాలేదు. కర్నాటకలో కురిసిన వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 90 టీఎంసీలకు పైగా వరద వచ్చింది. ఆ నీటితో తెలంగాణ సర్కారు కరెంట్​ఉత్పత్తి చేస్తూ నాగార్జున సాగర్‌‌‌‌‌‌‌‌కు నీటిని విడుదల చేస్తున్నది. సాగర్‌‌‌‌‌‌‌‌లో కనీస నీటి మట్టానికి కేవలం 11 టీఎంసీల నీళ్లే అధికంగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాజెక్టుపైనే ఆధారపడిన 20 లక్షల ఎకరాల ఆయకట్టు (తెలంగాణ, ఏపీలో కలిపి)కు నీళ్లు లేకుండా పోయాయి. శ్రీశైలంలో ఉన్న నీళ్లను కరెంట్​ఉత్పత్తి ద్వారా సాగర్​కు విడుదల చేస్తే దాని కింది ఆయకట్టుకు వర్షాలు కురిసే వరకు ఆన్​అండ్​ఆఫ్​పద్ధతిలో మూడు, నాలుగు తడులు ఇచ్చే అవకాశం ఉంది. దీనికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం రాయలసీమకు నీళ్లు వస్తే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్​గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసింది. శ్రీశైలం నీళ్లు తరలించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ కృష్ణా బోర్డు కోరింది. తుంగభద్రలో సమృద్ధిగా నీళ్లున్నా శ్రీశైలం నుంచే నీటి విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరడంపై తెలంగాణ ఇంజినీర్లు మండిపడుతున్నారు.

16 టీఎంసీలకు పర్మిషన్ అడిగి..

శ్రీశైలం నుంచి 16 టీఎంసీలు తీసుకునేందుకు అను మతి ఇవ్వాలని కోరుతూ కృష్ణా బోర్డుకు ఏపీ ఇండెంట్​పంపింది. చెన్నై తాగునీటికి 5 టీఎంసీలు, శ్రీశైలం రైట్​బ్యాంక్​కెనాల్/గాలేరు – నగరి సుజల స్రవంతికి 2.5, కేసీ కెనాల్​కు 2.5, హెచ్ఎన్ఎస్ఎస్​ నుంచి 4.5 టీఎంసీలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. దీనిపై తెలంగాణ అభిప్రాయం చెప్పాలని కోరుతూ బోర్డు ఇరిగేషన్​ ఈఎన్సీకి లేఖ రాసింది. ఈ ఇండెంట్​పై చర్చించేందుకు ఈనెల 21న ఉదయం 11.30 గంటలకు త్రీ మెంబర్​కమిటీ సమావేశం నిర్వహిస్తామని, ఈ సమావేశానికి హాజరు కావాలని కోరింది.

కేఆర్ఎంబీ మెంబర్​ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీలో రెండు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా ఉంటారు. ఈ సమావేశంలో చర్చించిన తర్వాతే ఆయా ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని అవసరాల మేరకు వినియోగించుకునేందుకు అనుమతిస్తూ బోర్డు వాటర్​రిలీజ్​ఆర్డర్​ఇస్తుంది. అది ఇవ్వకుండానే ఏపీ నీటి తరలింపును మొదలు పెట్టింది. తమ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే విషయంలో ఒకలా, రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే కరెంట్​ఉత్పత్తి విషయంలో ఏకపక్షంగా ఏపీ వ్యవహరించడం పరిపాటిగా మారింది. కానీ ఏపీని కట్టడి చేయాల్సిన బోర్డు చర్యలు చేపట్టడం లేదు.