సీన్ రివర్స్..ఇక్కడే ఉంటామన్నవలస కూలీలు

సీన్ రివర్స్..ఇక్కడే ఉంటామన్నవలస కూలీలు

పెద్దపల్లి, వెలుగుఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికుల్లో చాలా మంది లాక్​డౌన్​కారణంగా పనిలేక సొంతూర్ల బాటపట్టారు. ఇప్పటికే వేలాది మంది వెళ్లిపోగా.. ఉన్న వాళ్లూ ఎలా వెళ్లాలా అని ఎదురుచూస్తున్నారు. సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ట్రాన్స్​పోర్ట్​ సౌకర్యం కల్పించాలని ఆఫీసర్లను కోరుతున్నారు. కానీ పెద్దపల్లి జిల్లాలోని ఇటుక తయారీ పరిశ్రమల్లో పరిస్థితి డిఫరెంట్​గా ఉంది. ఆయాచోట్ల పనిచేస్తున్న సుమారు 12 వేల మంది వలస కార్మికులు తాము ఇక్కడే ఉంటామని, వెళ్లిపోబోమని చెప్తున్నారు. దీనికి కారణం పెద్దపల్లి జిల్లా కలెక్టర్​ సిక్తా పట్నాయక్ సహా జిల్లా ఆఫీసర్లు తీసుకున్న చర్యలు, ముందు జాగ్రత్తలే. లాక్​డౌన్​ తొలిరోజే రంగంలోకి దిగిన ఆఫీసర్లు,  కార్మికుల పనికి, జీతానికి, తిండికి లోటు లేకుండా చూశారు. కరోనా నుంచి రక్షించుకునే చర్యలు చేపడుతూనే.. పనులూ కొనసాగేలా చూశారు.

112 ఇటుక బట్టీలు

ఇటుకల తయారీ ఇండస్ట్రీకి పెద్దపల్లి జిల్లా కీలకం. ఇక్కడ 112 ఇటుక తయారీ పరిశ్రమలు ఉన్నాయి. 12 వేల మందికిపైగా ఒడిశా కార్మికులు పనిచేస్తున్నారు. ఏటా నవంబర్​లో వచ్చి.. జూన్​లో వర్షాలు మొదలయ్యే వరకు ఉంటారు. పెద్దపల్లిలో తయారయ్యే ఇటుకలు రాష్ట్రవ్యాప్తంగా నలుమూలలకూ రవాణా అవుతాయి. అయితే కరోనా కట్టడి కోసం మార్చి 23 నుంచి లాక్​డౌన్​ విధించడంతో సమస్య మొదలైంది. ఇటుకల తయారీ ఆపేయాలని యజమానులు భావించారు. ఈ సమయంలో పెద్దపల్లి కలెక్టర్​ రంగంలోకి దిగి ఇటుక బట్టీల యాజమానులతో సమావేశమయ్యారు. ఇటుకల తయారీ ఆపొద్దని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉదయం ఐదు నుంచి ఏడు వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు.. మాస్కులు ధరించి, సోషల్​ డిస్టెన్స్​ పాటిస్తూ పనులు కొనసాగించాలని సూచించారు.

ఉన్న చోటికే నిత్యావసరాలు.. హెల్త్​ స్క్రీనింగ్

ఇటుక ట్రాన్స్​పోర్ట్​ లేక నష్టం వచ్చే పరిస్థితుల్లోనూ యజమానులు కలెక్టర్​ సూచనల మేరకు పనులు కొనసాగించారు. కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు అందించి.. సోషల్​ డిస్టెన్స్​తో పనులు చేయించారు. కూరగాయలు, ఇతర నిత్యవసరాలను కూడా తెచ్చివ్వడం మొదలుపెట్టారు. ఇందుకు అధికారులూ సహకరించారు. ఇదే సమయంలో కలెక్టర్​ 61 హెల్త్​ టీమ్​లను ఏర్పాటు చేసి 12,336 మంది కార్మికులకు థర్మల్​ స్క్రీనింగ్, ఇతర వైద్య పరీక్షలు చేయించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. కార్మికులకు జీతాలు కూడా ఇప్పించారు.

 పరిశ్రమను బతికించుకున్నరు

లాక్ డౌన్​ టైమ్​లో జిల్లా యంత్రాంగం తీసుకున్న నిర్ణయంతో ఇటుక పరిశ్రమ బతికింది. అధికారులు ఇటుకల తయారీ ముడి సరుకులైన బూడిద, ఉనుక, బొగ్గు రవాణాకు అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కన్​స్ట్రక్షన్స్​కు అనుమతి ఇవ్వడంతో ఇటుకల రవాణా మొదలైంది. మొత్తంగా 12 వేల మంది వలస కార్మికులు, 112 పరిశ్రమలు లాక్​డౌన్​ సమస్య నుంచి బయటపడినట్టయింది.

ట్రాన్స్​పోర్ట్​ లేకున్నా ప్రొడక్షన్​ వచ్చింది

‘‘లాక్​డౌన్​ వల్ల ఇటుకల ట్రాన్స్​పోర్ట్​ నిలిచిపోయింది. జిల్లా ఆఫీసర్లు తీసుకున్న నిర్ణయంతో కనీసం ప్రొడక్షన్​ వచ్చింది. లేకుంటే బట్టీల యాజమానులు నష్టపోవడంతో నిర్మాణాలకు ఇబ్బంది అయ్యేది. కార్మికులు ఇంటిదారి పడితే ఆపడం ఎవరి తరం కాకపోయేది.’’

-సిద్దయ్య, ఇటుక బట్టి యాజమాని,

మాకు ఈడ్నే మంచిగుంది

‘‘కరోనాతోటి మొదట్లో భయపడ్డాం. లాక్ డౌన్​లో పనులు జరగకపోతే ఊర్లకు పోదామనుకున్నం. కానీ మాకు ఇక్కడ ఏం తక్లీబ్​ లేకుండ పనులు చేయించిన్రు. సరుకులన్నీ తెచ్చి ఇస్తున్నరు. డాక్టర్లు వచ్చి చూస్తున్నరు. ఎలాంటి భయం లేదు. పనులు అయిపోయేదాక ఎక్కడికీ వెళ్లం..’’

-సదానంద్​ హతీ, ఒడిశా కార్మికుడు