ఎన్నికల బరిలో 12,898 మంది

ఎన్నికల బరిలో 12,898 మంది

నిజామాబాద్‌లో ఎక్కువగా 415 మంది
వడ్డెపల్లిలో 29 మంది మాత్రమే
79 వార్డులు, ఒక డివిజన్ ఏకగ్రీవం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో 12, 898 మంది బరిలో
ఉన్నారు. మొత్తం 2,727 వార్డులు, 325 డివిజన్లలో ఎన్నికలు జరిపేందుకు ఈనెల 7న రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిపికేషన్ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు 20,125 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో 7,227 మంది విత్ డ్రా చేసుకున్నారు. 79 వార్డులు, ఒక డివిజన్ ఏకగ్రీవమయ్యాయి. 76 వార్డులు, ఒక డివిజన్‌ను టీఆర్ఎస్ పోటీ లేకుండా గెలుచుకోగా, మూడు వార్డుల్లో ఎంఐఎం క్యాండిడేట్లు ఏకగ్రీవమయ్యారు. చెన్నూరులో 14 వార్డులకు ఏడు వార్డులు, పరకాలలో 22 వార్డులకుగాను 11 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,648 వార్డులు, 324 డివిజన్లకు ఈనెల 22న పోలింగ్ జరుగనుంది. నిజామాబాద్ కార్పొరేషన్‌లో అన్ని చోట్లకంటే ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. ఇక్కడ 60 డివిజన్లకు గాను 415 మంది బరిలో ఉన్నారు. వడ్డెపల్లి మున్సిపాలిటీలో అతితక్కువగా 29 మంది మాత్రమే పోటీలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ 22న జరుగుతుంది. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే 24న రీపోలింగ్ నిర్వహిస్తారు. 25న ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. ఈ ఫలితాలు వచ్చిన తర్వాత మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వనుంది. వార్డులు డివిజన్ల వారీగా బ్యాలెట్ పేపర్లను ప్రింట్ చేసేందుకు కలెక్టర్లు ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికే గుర్తించిన ప్రింటింగ్ ప్రెస్‌లలో గట్టి బందోబస్తు మధ్య బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ జరుగుతుంది.

ఇండిపెండెంట్లు 3,749 మంది
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్‌ బరిలో ఇండిపెండెంట్లు తక్కువేమీ లేరు. లోకల్ ఎన్నికలు కావడంతో ఓటర్లు పార్టీతో పాటు క్యాండిడేట్ ఇమేజీని కూడా చూస్తారు. దీంతో స్థానికంగా ప్రజలతో మంచి సంబంధాలు ఉండి, పార్టీ టికెట్లు రాని 3,749 మంది ఇండిపెండెంట్లుగా పోటీలో నిలబడ్డారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో పోటీలో ఉన్న 415 మందిలో 183 మంది ఇండిపెండెంట్లే. రామగుండం కార్పోరేషన్‌లో 133 మంది, ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో 118 మంది ఇండిపెండెట్లుగా పోటీ చేస్తున్నారు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో 124 మంది ఇండిపెండెంట్లు గెలిచారు. ఈసారి కూడా చాలా చోట్ల ప్రధాన పార్టీల క్యాండిడెట్లకు వీళ్లే ప్రధానంగా పోటీ ఇస్తున్నారు. లోకల్‌గా బలం, బలగం ఉన్నవారు బరిలో నిలవడంతో ఆయా పార్టీల క్యాండిడెట్లకు వెన్నులో చలిపుడుతుంది.